సీఎం జగన్ ప్రభుత్వంలో మహిళలకి అత్యధిక ప్రాధాన్యత ఉందని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. మంగళవారం అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పధకాలన్నీ మహిళా లబ్దిదారులకి అందేలా కృషిచేస్తున్న సచివాలయ మహిళా ఉద్యోగులకి అభినందనలు తెలిపారు. నాకు చిన్నప్పటి నుంచి మా అన్నయ్యలే నాకు అండగా నిలబడ్డారన్నారు. నేను సినిమాలలోకి అడుగు పెట్టేటపుడు నాకు తోడుగా మా అన్నయ్యలు వచ్చేవారని, రాజకీయాలలో నన్ను నా భర్త సెల్వమణి ప్రోత్సహించారని ఆమె వెల్లడించారు.
నేను రాజకీయాలలోకి రాణించడానికి నా భర్త ప్రోత్సాహమే కారణమని, ప్రతీ మగవాడి విజయం వెనుక ఒక మహిళ ఉన్నది ఎంత నిజమో… ఒక మహిళ విజయం పక్కన కూడా ఒక మగవాడు ఉంటాడని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. అది తండ్రి కానీ.. భర్త కానీ.. సోదరులు కానీ.. కొడుకులు కానీ అని ఆమె అన్నారు. మన సేవింగ్స్ లోంచి పది శాతం మహిళల అభివృద్దికి ఖర్చు పెట్టాలని, మల్టీ టాస్క్ ఒక్క మహిళకే సాధ్యమని, ఎన్ని విమర్శలు వచ్చినా లక్ష్య సాధనకోసం మహిళలు వెనుకడుగు వేయద్దని ఆమె పిలుపునిచ్చారు.