Rapaka Varaprasad: రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నన్ను ప్రలోభ పెట్టిందని.. రూ.10 కోట్ల ఆఫర్ ఇచ్చిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఓవైపు.. గతంలో తాను సర్పంచ్‌గా దొంగ ఓట్లుతో గెలిచానని.. చింతలమోరి గ్రామంలో నా ఇంటి వద్ద పోలింగ్ బూత్‌లో దొంగ ఓట్లు పడేవని.. నా అనుచరులు ఒక్కొక్కరు పదేసి ఓట్లు వేసేసేవారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఇది తీవ్ర వివాదంగా మారింది.. అయితే, ఆ వీడియోపై మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే రాపాక.. ఎప్పుడో 32 ఏళ్ల క్రితం జరిగిన సందర్భాన్ని ఆత్మీయ సమ్మేళనంలో ప్రస్తావిస్తే, దానిని ఇప్పుడు జరిగి నట్లు ప్రచారం చేయడం తగదని హితవుపలికారు.
అయితే, సదరు వ్యాఖ్యలు అందరూ నవ్వుకునేందుకు చెప్పిన మాటలేనని, సీరియస్ గా చెప్పినవి కావు అంటున్నారు ఎమ్మేల్యే రాపాక.. రాజోలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలుగుదేశం పార్టీని విమర్శిస్తే జనసైనికులు ఆందోళన చేయడం ఎందుకని ప్రశ్నించారు. జనసేన నన్ను ఏమైనా ఓటు వేయమని అడిగారా ? అని నిలదీశారు. 2019లో 810 ఓట్ల స్వల్ప మెజారిటీతో వైసీపీ అభ్యర్థిపై విజయం సాధించా, అంతకుముందు తొలిసారి 2009లో కాంగ్రెస్ తరఫున 4,600 ఓట్ల ఆధిక్యంతో గెలిచిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక, బొంగు రాజేశ్వరరావు చేతకాని దద్దమ్మ అంటూ ఫైర్ అయ్యారు.. రాష్ట్రం అంతా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి వీచి.. 151 సీట్లు గెలిస్తే.. సత్తా లేక బొంతు.. రాజోలులో ఓడిపోయాడని మండిపడ్డారు.. మరోవైపు.. ఇప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నన్ను ప్రలోభ పెట్టినట్లు చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని అన్నారు. గత ఎన్నికల్లో నాకు ఓటు వేసింది జనసైనికులే, ఎస్సీలు వైసీపీకి వేశారని స్పష్టం చేశారు. అయితే, నేను వైసీపీలోకి వచ్చానని బొంతు వర్గం ఆత్మీయ సమావేశం పెట్టి ఆహ్వానించారని వివరణ ఇచ్చారు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.