కరోనా సెకండ్ వేవ్ సమయంలో.. కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేస్తున్న ఆయుర్వేద మందు పనితీరు.. గ్రామాలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు.. దాటేసింది.. దీంతో.. కోవిడ్ మందు కోసం తరలివచ్చినవారితో కృష్ణపట్నం జనసంద్రంగా మారిపోయింది.. దీంతో.. తాత్కాలికంగా పంపిణీని నిలిపివేశారు. ఇక, ఆయుర్వేద మందు పంపిణీపై స్పందించిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. ఇవాళ సాయంత్రం ఐసీఎంఆర్ బృందం నెల్లూరు కి చేరుకుంటుందని.. ఇతర రాష్ట్రాల నుంచి కరోనా మందు కోసం ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు.. వేల మంది రావడంతో పోలీసులు కూడా నియంత్రించలేని పరిస్థితి ఏర్పడిందన్న ఆయన.. సాయంత్రం నాటికి ఆయుష్ అనుమతులు కూడా వస్తాయని భావిస్తున్నామని తెలిపారు.. వనమూలికలు సేకరించి మరో రెండు రోజుల్లో మందు తయారుచేస్తారని.. ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ప్రభుత్వ అనుమతులు, క్లీన్ చిట్ వస్తే రాష్ట్రాల వారికి కొరియర్ చేసే ఆలోచనలు చేస్తున్నామని వెల్లడించారు. ఇక, పెద్ద ఎత్తున రోగులు గ్రామానికి వస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే.. మందుపంపిణీ ప్రాంతాన్ని వేరే చోటకు మార్చబోతున్నామని.. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే మండలాల వారీగా మందు పంపిణీ చేసేలా ఆలోచనలు చేస్తున్నామని తెలిపారు.