ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుండటంపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పందించారు. గత ప్రభుత్వం టీడీపీ హయాంలో విద్యుత్ ఛార్జీలను పెంచలేదా అని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన ఉచిత విద్యుత్ పథకాలను చంద్రబాబు తీసివేయలేదా అని నిలదీశారు. గతంలో విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై భారం వేసింది తెలుగుదేశంపార్టీనే అని మంత్రి వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు. ప్రజలను ఏదో విధంగా దృష్టి మరల్చడమే టీడీపీ లక్ష్యంగా కనిపిస్తోందన్నారు. ఏ ప్రభుత్వం మంచి చేస్తుందో.. ఆదుకుంటుందో అనే విషయం ప్రజలకు తెలుసన్నారు.
మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డితో బీసీ మంత్రులు సమావేశమై పలు అంశాల గురించి మాట్లాడారు. బీసీల కోసం సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు, ప్రజలకు జరిగిన మేలుపై నేతలంతా కలిసి చర్చించామని మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. 139 బీసీ కులాలు ఉంటే 56 కార్పొరేషన్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. బీసీల ఆత్మగౌరవం కోసం తీసుకున్న చర్యలను వివరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సదస్సులు చేపట్టాలని నిర్ణయించామన్నారు. బీసీల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహించాలని తలపెట్టామన్నారు. తొలుత అన్ని కొత్త జిల్లాల్లో బీసీ ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో బీసీ సదస్సు నిర్వహిస్తామన్నారు. రూ.31 వేల కోట్లను బీసీ సబ్ ప్లాన్ కోసం ప్రభుత్వం కేటాయించిందని పేర్కొన్నారు. బీసీలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారనే విషయాన్ని క్షేత్ర స్థాయికి తీసుకువెళ్తామన్నారు.