Minister Peddireddy Ramachandra Reddy: మనం పార్టీ కోసం శ్రమిస్తే, మన కోసం సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మరింత కృషి చేస్తారని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. అనంతపురంలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షుల పరిచయ కార్యక్రమంలో మంత్రి ఉషశ్రీ చరణ్, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసిన పాల్గొన్న రీజనల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు పార్టీ కోసం కృషి చేయాలి అని పిలుపునిచ్చారు.. సీఎం వైఎస్ జగన్ మిమ్మల్ని గుర్తించి, బాధ్యతలు అప్పగించారు.. మీరు బాధ్యత తీసుకుని పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల విజయం కోసం కృషి చేయాలని స్పష్టం చేశారు.. ఈ నెల 13వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి మెజారిటీతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు.. అందరూ వారివారి సంఘాల్లో సమన్వయంతో పని చేయాలి.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలు గమనిస్తున్నారు.. సామాన్య ప్రజలు, ఉద్యోగులు అంతా వైసీపీకి మద్దతుగా నిలుస్తారు అనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది.. ఈ మధ్యే కడప ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు మంత్రి పెద్దిరెడ్డి.. రాయలసీమ కర్నూల్, అనంతపురం, కడప శాసనమండలి ఎన్నికలు జరుగుతున్నాయి.. మా అభ్యర్థులు శాసనసభ్యులతో కలసి మమేకమై విజయం దిశగా అడుగులు వేసేందుకు సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.. ఇక, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఉద్యోగులకు, పట్టభద్రులకు అనేక మంచి పనులు చేశారని ప్రశంసలు కురిపించారు.. ఇదే సమయంలో.. విపక్షాలపై విరుచుకుపడ్డారు.. రాష్ట్రంలో పరిశ్రమలు రావట్లేదు అని ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. గత ఏడాది దేశంలోనే ఏపీకి అత్యధిక పెట్టుబడులు వచ్చాయని స్పష్టం చేసిన విషయం విదితమే.