PeddiReddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడని.. సీఎంగా ఆయన చేసిన అభివృద్ధి కంటే జగన్ సహకారంతో తాను చేసిన అభివృద్ధే ఎక్కువ అని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. పండుగరోజు కూడా తనను గుర్తు పెట్టుకుని నారావారిపల్లిలో మాట్లాడాడు అని మండిపడ్డారు. పండుగరోజు కూడా చంద్రబాబు సంతోషంగా లేని పరిస్థితి కనిపిస్తోందన్నారు. అప్పుడు వైఎస్ఆర్, ఇప్పుడు జగన్‌పై చంద్రబాబు ఏడుపు కొనసాగుతోందన్నారు. 2019 నుంచే రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని చంద్రబాబు మర్చిపోయాడన్నారు.
Read Also: Anand Mahindra: నాటు నాటు అంత ఎనర్జీలేదు.. ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్
చిత్తూరు జిల్లా నుంచి సీఎం అయిన చంద్రబాబు జిల్లాకు ఏం చేశాడో చెప్పాలని మంత్రి పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. పార్టీని అడ్డు పెట్టుకుని చంద్రబాబు కార్యకర్తలు గూండాయిజం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. చంద్రబాబు తన శక్తి ఏంటో తెలుసుకుని మాట్లాడాలన్నారు. జగన్ సీఎం అయ్యాకా చంద్రబాబు సొంత జిల్లాలో పార్టీని నామరూపాలు లేకుండా చేశామన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీనే గెలుస్తుందన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి కుప్పంను అభివృద్ధి చేయని వ్యక్తి చంద్రబాబు అని పెద్దిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు చేయలేని కుప్పం అభివృద్ధిని సీఎం జగన్ చేసి చూపుతున్నారన్నారు. కారు కూతలు కూస్తే సహించేందుకు సిద్ధంగా లేమన్నారు. చిత్తూరు జిల్లాకు నువ్వు భారమో, తాను భారమో ప్రజలే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాతో చంద్రబాబుకు సంబంధమే లేదన్నారు. కులాన్ని అడ్డుపెట్టుకుని పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడని, ఆ కులానికి సంబంధించిన వంగవీటి రంగాను చంపించింది చంద్రబాబు కాదా అని నిలదీశారు. భోగి మంటల్లో కాల్చాల్సింది జీఓ నెం.1ను కాదు, సీఎం కావాలనే తాపత్రయాన్ని కాల్చుకోవాలన్నారు. కేఏ పాల్ తరహాలో చంద్రబాబు కలలు కంటున్నాడని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో కూడా చంద్రబాబు జెండా పీకేస్తామన్నారు.