NTV Telugu Site icon

Kottu Satyanarayana: పవన్‌ కల్యాణ్‌ది మా సామాజిక వర్గం.. నాకు అభిమానం ఉండదా..?

Kottu Satyanarayana

Kottu Satyanarayana

Kottu Satyanarayana: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. పవన్ కల్యాణ్‌ మా వాడు.. అభిమానం ఉందన్న ఆయన.. మా సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్‌ మీద మాకు అభిమానం ఉండదా..? అని ఎదురు ప్రశ్నించారు.. అయితే, పవన్ చేష్టల వల్ల కాపుల పరువు తీస్తున్నాడనే బాధ మాకుందన్నారు.. ఇక, సీఎం.. సీఎం.. అంటూ పవన్‌ కల్యాణ్‌ను చూసి నినాదాలు చేస్తున్నవారికి ఆయన అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.. మరోవైపు.. కాపులు ముఖ్యమంత్రి కావాలనే కోరిక నాకు లేదని స్పష్టం చేశారు.. పవన్ వెనక తిరిగే వారికి మాత్రమే పవన్ సీఎం కావాలనే కోరిక ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే సమయంలో.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ భేటీపై స్పందిస్తూ.. చంద్రబాబుతో పవన్ పొత్తు అపవిత్ర కలయికగా పేర్కొన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ.

Read Also: Anil Kumar Yadav: మంత్రి పదవి నుంచి తొలగించి సీఎం మంచే చేశారు.. మాజీ మంత్రి అనిల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

మరోవైపు.. విజయనగరం దేవదాయ శాఖ ఏసీ పరిధి దాటారని ఫైర్‌ అయ్యారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. పరిధి దాటిన ఏసీపై కచ్చితంగా చర్యలుంటాయని హెచ్చరించారు. దేవాలయాల భూములను కాపాడడం మా బాధ్యత.. పీఠాధిపతులు.. మఠాధిపతుల సదస్సు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం.. త్వరలో తేదీ ఖరారు చేస్తాం అన్నారు.. హిందూ ధర్మ ప్రచారానికి సంబంధించిన అంశంపై సదస్సులో చర్చిస్తాం అన్నారు. రూ. 249 కోట్ల సీజీఎఫ్ నిధులతో దేవాలయాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం.. వీటిలో చాలా వరకు టెండర్లు పిలిచాం అన్నారు.. సీజీఎఫ్ నిధుల ద్వారా పెద్ద ఎత్తున ఆలయాల అభివృద్ధి చేపడుతున్నాం.. సీజీఎఫ్ నిధుల వినియోగం.. పనుల పర్యవేక్షణపై ప్రతి 15 రోజులకూ సమీక్ష చేపడుతున్నామని వెల్లడించారు. ఆలయాల నుంచి సీజీఎఫ్ నిధులు జమ అవుతున్నాయని.. 13 మందితో ఆగమ సలహాదారుల బోర్డు ఏర్పాటు చేశామన్నారు.. ఇక, ఏపీలో బలవంతపు మత మార్పిళ్లు జరగడం లేదన్నారు.. బలవంతంగా మత మార్పిళ్లు జరుగుతున్నాయనే అంశం మా దృష్టికి రాలేదని.. దేవాదాయ శాఖలో పని చేసే వారిలో దళితులే ఎక్కువ శాతం మంది ఉన్నారని వెల్లడించారు మంత్రి కొట్టు సత్యనారాయణ.