టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి కొడాలి నాని ఆ పార్టీపై తీవ్రంగా విమర్శలు చేశారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని చంద్రబాబు లాక్కున్నారని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబుకు ఎన్టీఆర్‌పై ఎలాంటి ప్రేమ లేదని.. ఎన్టీఆర్‌ను పార్టీ నుంచి ఎందుకు బయటకు పంపారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. మీరే పార్టీ లాక్కుంటారని.. మీరే వెన్నుపోటు పొడుస్తారని.. మీరే మళ్లీ ఎన్టీఆర్ ఫోటోకు దండలు వేస్తారని చంద్రబాబును ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
టీడీపీలో చంద్రబాబు తీసుకొచ్చిన ఒక్క పథకమైనా ప్రజలు గుర్తుపెట్టుకునేలా ఉందా అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ను మోసం చేసిన చంద్రబాబును ఏం అనాలో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఎన్టీఆర్ శాపం చంద్రబాబుకు తప్పకుండా తగులుతుందని.. ఇప్పటికే టీడీపీ దిగజారిపోయిందని విమర్శించారు. అందుకే గత ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లకే పరిమితం అయ్యిందన్నారు. 73 ఏళ్ల వయసులో చంద్రబాబు నుంచోలేడు.. కూర్చోలేడు అని.. ఆయన టీడీపీని పరుగెత్తిస్తాడంట అంటూ ఎద్దేవా చేశారు. అటు ఎన్టీఆర్ శాపం వల్లే చంద్రబాబు కొడుకు పప్పు మంగళగిరిలో ఎమ్మెల్యే కూడా గెలవలేకపోయాడన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఎన్టీఆర్ అభిమానులు పగ, ప్రతీకారం తీర్చుకుంటారని మంత్రి కొడాలి నాని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు వల్లే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ పుట్టిందన్నారు. చంద్రబాబు వల్లే ఏపీ సర్వనాశనం అయిపోయిందని కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు టీడీపీ 40 ఏళ్ల సంబరాలపై వైసీపీ నేత, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. టీడీపీది 40 ఏళ్ల సంబరం కాదని.. 27 ఏళ్ల సంబరమే అని అభివర్ణించారు. ఎన్టీఆర్ ఉన్న టీడీపీ.. ఇప్పటి టీడీపీ వేరు అని సజ్జల ఆరోపించారు. కుట్రలతో అధికారంలోకి ఎలా రావాలన్నదే టీడీపీ పాలసీగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరగకుండా అడ్డుకోవడానికి టీడీపీ నేతలు అనేక ప్రయత్నాలు చేసినట్లు గుర్తుచేశారు.