ఎక్కడైనా వినియోగదారులను మోసం చేస్తే కఠిన శిక్షలు, భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి కార్మూరి నాగేశ్వరరావు.. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో వినియోగదారుడు మోసపోయిన ప్రాంతానికే వెళ్లి ఫిర్యాదు చేయాల్సి వచ్చేది.. కానీ, ఇప్పుడు ఎక్కడి నుంచి అయినా ఫిర్యాదు చేయవచ్చు అన్నారు.. ఆన్‌లైన్ ద్వారా కూడా వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించిన ఆయన.. టీ పొడిలో కల్తీ, కందిపప్పుకు రంగు వేయడం, పెట్రోల్ కల్తీ చేయడం వంటివి జరిగితే లీగల్ మెట్రాలజీ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.. ఇక, ఇటీవల మాల్స్ పై దాడులు జరిపి 194, బంగారం షాపులపై తనిఖీలు చేసి 94, పెట్రోల్ బంకులపై 90, ఎరువుల షాపులపై తనిఖీలు జరిపి 360కేసులు నమోదు చేశామని వెల్లడించారు.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
ఇక, వినియోగదారులను మోసం చేస్తే జైలు శిక్షతో పాటు.. భారీ జరిమానా తప్పదని హెచ్చరించారు మంత్రి నాగేశ్వరరావు.. మొదటిసారి తనిఖీల్లో పట్టుబడితే సంవత్సరం జైలు శిక్ష, పది లక్షల రూపాయల జరిమానా విధిస్తున్నామని తెలిపారు. రెండు సార్లు పట్టుబడితే 50 లక్షల రూపాయల జరిమానాతో పాటు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నామని గుర్తుచేశారు.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినియోగదారుల సంక్షేమ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నామని.. వినియోగదారులకు ఏ రకంగా నష్టం కలిగించినా చర్యలు తప్పవని హెచ్చరించారు పౌర సరఫరాల శాఖ మంత్రి కార్మూరి నాగేశ్వరరావు.