Jogi Ramesh: టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగిన అంశంపై మంత్రి జోగి రమేష్ స్పందించారు. చంద్రబాబు సరికొత్త నాటకానికి తెరతీశాడని ఆరోపించారు. ఆయన విషపు రాజకీయ కుట్రలో ఇది ఒక కోణమని.. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తనపై తానే రాయి విసిరించుకున్నాడని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. జగన్ దమ్మున్న నాయకుడు అని.. తనను అరెస్ట్ చేసి జైలుకు పంపినా సంయమనంతో వ్యవహరించి ప్రజల మనసులను గెలుచుకున్నారని ప్రశంసించారు. వచ్చే ఎన్నికల్లో తమ నాయకుడి లక్ష్యం 175కి 175 సీట్లు అని.. ఈ లక్ష్యం దిశగా తాము పనిచేస్తున్నామని.. అంతేకానీ దిక్కుమాలిన రాజకీయాలు చేసి చంద్రబాబుపై రాళ్లు వేయించాల్సిన పని లేదని మంత్రి జోగి రమేష్ అన్నారు.
Read Also: దేశంలోని ఈ ఉన్నత పదవులు పొందాంటే ఎంత వయసు ఉండాలి?
ఒక పక్క రెక్కీ, రెండో పక్కేమో రాయి అంటూ టీడీపీ, జనసేన నేతలు కుట్ర అంటూ గోల చేస్తున్నారని.. కానీ తెలంగాణ పోలీసులు కొంతమంది తప్పతాగి చేసిన గలాటాగా తేల్చారని మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు చంద్రబాబు రాయి అంటూ కొత్త రాగం అందుకున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాయి ఎవరితో వేయించుకున్నాడో తాము తేలుస్తామన్నారు. ఆయన బండారం బయటపెడతామని.. ఎన్టీఆర్ హయాంలో మల్లెల బాబ్జీ ఎపిసోడ్‌లో ఏం చేశారో ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు.
పార్ట్-1 పవన్ డ్రామా ఎపిసోడ్.. పార్ట్-2 చంద్రబాబు డ్రామా ఎపిసోడ్ జరిగాయని.. రేపు పార్ట్-3గా ఇప్పడటం ఎపిసోడ్ ఉంటుందని మంత్రి జోగి రమేష్ చురకలు అంటించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడబలుక్కుని చేస్తున్నా డ్రామాలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు దుమ్ముంటే 175 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని ప్రకటించాలని సవాల్ విసిరారు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పగలడా అని.. ముఖ్యమంత్రి అభ్యర్థిని తానే అని చెప్పగల ధైర్యం ఉందా అని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. చంద్రబాబు ఎపిసోడ్‌లో కథా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎవరిదో తేలుస్తామన్నారు. బీజేపీ నాలుగు రాష్ట్రాలను కూల్చే ప్రయత్నం చేస్తుందని కేసీఆర్‌కు ఏమైనా సమాచారం ఉందేమో కానీ మాకైతే ఎటువంటి సమాచారం లేదని మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు.