Site icon NTV Telugu

Gudivada Amarnath: పవన్.. వచ్చే ఎన్నికల్లో నీ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందా?

Gudivada Amarnath

Gudivada Amarnath

Gudivada Amarnath: అనకాపల్లిలో మంత్రి గుడివాడ అమర్నాథ్ సోమవారం నాడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. అసలు సొంతంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ నుండి జనసేన పార్టీకి స్వతంత్రం వచ్చిందా అని పవన్ కళ్యాణ్‌ను ఆయన సూటిగా ప్రశ్నించారు. 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో తెలుగుదేశం పార్టీ నుంచి స్వతంత్రం కోసం జనసైనికులు ఎదురుచూస్తున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ అభిప్రాయపడ్డారు. ఒంటరిగా పోటీ చేసే స్వాతంత్రం లేని పవన్ కళ్యాణ్ స్వాతంత్ర్యం గురించి మాట్లాడటం సిగ్గుచేటు అని మండిపడ్డారు.

Read Also: Dwakra Products: అమెజాన్‌లో ఏపీ డ్వాక్రా మహిళల ఉత్పత్తుల విక్రయాలు

2024 ఎన్నికల్లో 175 ఎమ్మెల్యే స్థానాలలో, 25 ఎంపీ స్థానాలలో నీ పార్టీ పోటీ చేస్తుందా.. దీనికి ముందు సమాధానం చెప్పు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ పరిపాలనతో రాష్ట్ర ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని.. ప్రజల సంతోషాన్ని చూడలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ప్రజలను మభ్యపెట్టి చంద్రబాబుకు లబ్ధి చేకూర్చడం కోసం పవన్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని.. సీఎం జగన్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. పవన్ కళ్యాణ్ వల్ల రాష్ట్రానికి ఎటువంటి మేలు జరగదని స్పష్టం చేశారు.

Exit mobile version