Gudivada Amarnath: ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరువు, చంద్రబాబు కవల పిల్లలు అని ఆయన ఆరోపించారు. దావోస్ సదస్సుకు రాష్ట్రానికి ఆహ్వానం అందలేదనే దుష్ప్రచారాన్ని టీడీపీ ప్రారంభించిందని.. నవంబర్ 25నే ముఖ్యమంత్రి పేరు మీద ఆహ్వానం అందిందని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్ వన్ ఏపీ అని.. 97వేల కోట్ల రూపాయలు ఏపీ నుంచి ఎగుమతులు జరిగాయని వివరించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా పంటల దిగుబడులు వస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి చరిష్మా, హీరోయిజం చూసే పెట్టుబడులు వస్తున్నాయని.. అందుకు ప్రకృతి కూడా సహకరిస్తోందని మంత్రి అమర్నాథ్ చెప్పారు.
Read Also: Temple Land Kabja: దేవుడి భూమికే దిక్కులేదు.. దర్జాగా కబ్జా
ఐదేళ్లలో దావోస్ వెళ్లి వచ్చిన టీడీపీ పాలకులు పెట్టుబడులు తెచ్చామని చెప్పుకున్న ఒక్కటీ గ్రౌండ్ అవ్వలేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ చురకలు అంటించారు. బిల్డప్ బాబు దావోస్‌కు వెళ్లి ప్రచారాలకు పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఓ 420 తనపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని.. తాను కోడి పందాలు, రికార్డింగ్ డాన్సుల్లో ఉన్నానని తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడ దావుద్ ఇబ్రహీం., కాల్ మనీ సెక్స్ రాకెట్ నిందితుడు వచ్చి జగన్ గురించి మాట్లాడడం శోచనీయమన్నారు.
దావోస్ నుంచి మార్చి నెలలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సదస్సుకు ఆహ్వానించామని.. ఆ వేదికపై పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకుని వస్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. టీడీపీలో ఐదేళ్లలో ఏడాదికి వచ్చిన పెట్టుబడులు 11వేల కోట్లు అని.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికి రూ.15వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని స్పష్టం చేశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వేదికపై చంద్రబాబు మాట్లాడిన ఒక్క వీడియో అయినా టీడీపీ చూపించగలదా అని ప్రశ్నించారు. అమర్ రాజా బ్యాటరీస్ తెలంగాణకు తరలిపోవడానికి ప్రభుత్వమే కారణమని తప్పుడు ప్రచారం చేశారని.. ఇన్ఫోసిస్ సీఈవోగా సత్యనాదెళ్లను ప్రమోట్ చేశామని గొప్పలు చెప్పుకునే చరిత్ర టీడీపీ పాలకులది అని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వ హయాంలో కాకినాడలో గ్రీన్ ఎనర్జీ సెజ్ నిర్మాణం జరుగుతోందన్నారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ వారాహి వాహనంపైనా మంత్రి అమర్నాథ్ సెటైర్లు వేశారు. టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రచారాలు ప్రారంభిస్తే మంచిదని.. ఇరు పార్టీలకు ఖర్చులు కలిసి వస్తాయని సూచించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ది భార్యాభర్తల అనుబంధం అని ఆరోపించారు. వారాహి మీద పవన్ కళ్యాణ్ ఒక్కరే పర్యటిస్తారా.. చంద్రబాబుతో కలిసి వస్తారో చెప్పాలన్నారు. జీవో నెంబర్ 1 మీద సుప్రీంకోర్టులో ఎస్.ఎల్.పి. వేశామని.. రహదారులపై బహిరంగ సభలకు మాత్రమే అనుమతి లేదన్నారు. ఈ విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానానికి నివేదిస్తామన్నారు.