Dharmana Prasad Rao: విశాఖ రాజధాని విషయంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ విషయంలో సీఎం జగన్ అనుమతిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి ధర్మాన తెలిపారు. విశాఖ మన రాజధాని కావాలని, పిల్లల భవిష్యత్ కోసం ఉద్యమం చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తనకు ఉద్యమంలోకి వెళ్లాలన్న ఆలోచన ఉందని.. అందుకే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ధర్మాన స్పష్టం చేశారు. మరోవైపు అమరావతి రైతుల పాదయాత్రపైనా మంత్రి ధర్మాన మండిపడ్డారు.
Read Also: Munugode Bypoll: మునుగోడు అభ్యర్థికి బీఫాం ఇచ్చిన కేసీఆర్.. ఎన్నికల ఖర్చుకోసం ఎంత ఇచ్చారంటే?
భూములకు ధరలు రావాలని, రియల్ ఎస్టేట్ కావాలని అమరావతి రైతులు ఆందోళన చేస్తే అర్ధముందని.. ఇలా పాదయాత్ర చేయడమేంటని మంత్రి ధర్మాన ఎద్దేవా చేశారు. అమాయకమైన రైతులకు పెట్టుబడి పెట్టి మరీ అరసవల్లి తీసుకొస్తున్నారని చంద్రబాబును ఉద్దేశించి మంత్రి ధర్మాన ఆరోపణలు చేశారు. రాజధాని విషయంలో చంద్రబాబు దొంగ ఎత్తులు వేస్తున్నారని.. ఇన్నేళ్ల తర్వాత విశాఖకు రాజధాని వస్తుంటే చంద్రబాబుకు ఎందుకు కోపం అని ధర్మాన ప్రశ్నించారు. తాము పుట్టిన ప్రాంతాలు ఎందుకు అభివృద్ధి చెందకూడదో చెప్పాలని ఆయన నిలదీశారు. విశాఖ రాజధానిని వ్యతిరేకించే వాళ్లను రాజకీయంగా బహిష్కరించాలని ధర్మాన డిమాండ్ చేశారు.