Minister Dadisetti Raja Fires On Pawan Kalyan: తన వారాహి యాత్రలో భాగంగా జనసేనాధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యాలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా.. వైసీపీ, సీఎం జగన్‌ని టార్గెట్ చేసుకుని పవన్ చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. దీంతో.. వైసీపీ నేతలు తమదైన శైలిలో పవన్‌పై కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. తాజాగా మంత్రి దాడిశెట్టి రాజా సైతం పవన్‌పై విరుచుకుపడ్డారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం పెరుమాళ్ళపురంలో నిర్వహించిన జగనన్న సురక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ మైక్ పట్టుకుని పిచ్చోడిలా మాట్లాడుతున్నాడని విమర్శించారు. పిచ్చి ప్రేలాపనలు తప్పితే, పవన్‌కి రాష్ట్రం గురించి ఏమీ తెలియదన్నారు. పవన్ మాటల్లో జగన్‌పై ఈర్ష, అసూయ మాత్రమే కనిపిస్తున్నాయని.. అతని కళ్లల్లో మాత్రం ఓటమి కనిపిస్తోందని పేర్కొన్నారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు సముద్రంలో కలిసిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఏపీ రాష్ట్రానికి జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
అంతకుముందు కూడా.. ఏపీ వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యల్ని మంత్రి దాడిశెట్టి రాజా తిప్పికొట్టారు. అన్నం తినేవాడు ఎవడైనా వాలంటీర్లను తిడతాడా..? అంటూ ధ్వజమెత్తారు. గడ్డి తినే వాళ్ళు మాత్రమే వాలంటీర్లపై నోరు పారేసుకుంటారని విమర్శించారు. కోవిడ్ సమయంలో వాలంటీర్లు ప్రాణాలకు తెగించి సేవ చేశారని.. పవన్ చేసిన వ్యాఖ్యలతో అతనికి రాష్ట్రంపై ఏమాత్రం అవగాహన లేదని తేలిపోయిందని అన్నారు. పవన్ చెప్పేవన్నీ అభూతకల్పనలు, అబద్ధాలేనని విరుచుకుపడ్డారు. పవన్ గంటలో నిర్ణయం, పూటకో మాట మాట్లాడుతున్నారని.. పవన్‌ను పార్టీ నాయకులు, కార్యకర్తలు మానసిక వైద్యుడికి చూపించాలని సూచించారు. ఎక్కడ పోటీ చేస్తాడో పవన్‌కే క్లారిటీ లేదన్న ఆయన.. పవన్ ఎమ్మెల్యే అవ్వాలన్నా, సీఎం అవ్వాలన్నా ప్రజలు ఓట్లు వెయ్యాలని పేర్కొన్నారు. గతంలో టీడీపీ, పవన్ కలిసి మేనిఫెస్టో రూపొందించారని.. ఆ హామీలు అమలు చేయలేకపోతే చంద్రబాబును నిలదీశావా? అని పవన్‌ని ప్రశ్నించారు. చంద్రబాబు తనకు ప్యాకేజీ సరిగా ఇవ్వడేమోనన్న భయంతోనే.. పవన్ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి రాజా మండిపడ్డారు.
Kishan Reddy: ప్రకృతిని కాపాడుకుందాం.. పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం..