ఏపీ పదోతరగతి పరీక్ష ఫలితాలు నేడు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలు రాసిన 6.22 లక్షల మంది విద్యార్థుల్లో.. 4.14 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన తెలిపారు.
మొత్తం ఉత్తీర్ణత శాతం 67.26గా ఉందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా బాలికల్లో 70 శాతం మంది విద్యార్థినులు పాసైయ్యారని.. ఈ సారి కూడా బాలికలదే పై చేయి అని ఆయన వెల్లడించారు. అయితే.. 78.3 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రకాశం జిల్లా మొదటి స్థానంలో ఉందన్న బొత్స.. అనంతపురంలో అత్యల్పంగా ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన వెల్లడించారు.