Botsa Satyanarayana: టీడీపీ అధినేత చంద్రబాబుపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీని నిలబెట్టుకోవడానికి చంద్రబాబు తెగ తాపత్రయ పడుతున్నాడని ఆయన ఆరోపించారు. ఆయనకు జవసత్వాలు అయిపోయాయని.. అందుకే వాటిని నిలుపుకోవడానికి పర్యటనలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. నిర్మాణాత్మకమైన అంశాలు చెబితే ప్రజలు దాని గురించి ఆలోచిస్తారని.. కానీ అసత్యాలు చెప్తే నమ్మరనే సంగతి గుర్తుపెట్టుకోవాలన్నారు. రాజాం, బొబ్బిలి సభలలో చంద్రబాబు అన్నీ అసత్యాలే చెప్పారని మంత్రి బొత్స మండిపడ్డారు. బొబ్బిలి రైతు సదస్సులో జగన్‌కు వ్యవసాయం గురించి ఏమి తెలుసు అన్నారని.. వ్యవసాయం దండగ అని.. కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్న చంద్రబాబు వ్యవసాయం గురించి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రైతు భరోసా కేంద్రాల వల్ల ఉపయోగం లేదని చంద్రబాబు అన్నారని.. నీతి ఆయోగ్ దేశమంతా ఆర్బీకేలు పెట్టాలని పరిశీలిస్తుంటే చంద్రబాబు మాత్రం వృధా అని చెప్పడాన్ని ప్రజలు గమనించాలన్నారు.
Read Also: Pakistan: పాకిస్థాన్ బోర్డు సంచలన నిర్ణయం.. సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా షాహిద్ అఫ్రిది నియామకం
గతంలో తాము గన్ని బ్యాగులు ఇవ్వకపోతే ధాన్యం రైతులు ధర్నా చేశారని.. మరి ఇప్పుడు ఎందుకు చేయటం లేదని చంద్రబాబు బొబ్బిలి సదస్సులో అన్నాడని.. నష్టం, కష్టం వస్తేనే రైతులు ధర్నా చేస్తారని.. లేకపోతే ఎందుకు చేస్తారని మంత్రి బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో రైతులు ఆత్మహత్య చేసుకునేవారని.. ఆయన హయాంలో వ్యవసాయం భ్రష్టు పట్టిపోయిందని.. రైతులు బక్క చిక్కిపోయారని ఆరోపించారు. తమ ప్రభుత్వంలో రైతులకు ఆర్బీకేల ద్వారానే ఎరువులు, విత్తనాలను అందిస్తున్నామని.. మరి రైతులు ఎందుకు ధర్నా చేస్తారని నిలదీశారు. నష్టం వస్తే వారికి క్రాఫ్ ఇన్సూరెన్స్ ద్వారా పరిహారం ఇస్తున్నామని తెలిపారు. రైతులు ధర్నా చేస్తే చంద్రబాబు కాల్పులు జరిపారని.. మరిచిపోయారా అని అన్నారు. నిజామ్ షుగర్స్ పరిశ్రమను ఎన్సీఎస్కు ఎవ్వరు అమ్మారని సూటిగా ప్రశ్నించారు.
బీసీల గురించి మాట్లాడుతున్న చంద్రబాబుకు ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలలో బీసీలు కనిపించడం లేదా అని మంత్రి బొత్స ప్రశ్నించారు. మరి బీసీలను కేంద్రమంత్రి చేయకుండా అశోక్‌గజపతిరాజును ఎందుకు కేంద్రమంత్రి చేశారో చెప్పాలన్నారు. తోటపల్లి ప్రాజెక్టును తమ హయాంలోనే 85 శాతం పూర్తి చేశామని.. ఇది వైఎస్ఆర్ పుణ్యమన్నారు. రామతీర్థం సాగర్ ప్రాజెక్టును చంద్రబాబు పక్కన పెట్టేశారని.. మళ్లీ ఇప్పుడు నిధులు కేటాయించి తాము పనులు ప్రారంభించడానికి సిద్ధమవుతున్నామని తెలిపారు. ప్రజలకు ఎవరు అందుబాటులో ఉంటారో తెలుసు అని.. అందుకే టీడీపీని ఇంటికి పంపారని మంత్రి బొత్స చురకలు అంటించారు. జగన్‌ను సైకో అంటున్న చంద్రబాబు తన భాష మార్చుకోవాలని హితవు పలికారు. 14 ఏళ్ల పరిపాలనలో ఉత్తరాంధ్రలో ఏ పరిశ్రమ ఏర్పాటు చేశారో చంద్రబాబు చెప్పాలన్నారు. నాడు, నేడు ప్రభుత్వ స్కూళ్లు ఎలా ఉన్నాయో ప్రజలతో పాటు చంద్రబాబు కూడా గమనించాలన్నారు.