ఏపీ టెన్త్ పేపర్ లీక్ కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఈ కేసుపై చర్చించేందుకు క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను మంత్రి బొత్స కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో అన్ని జిల్లాల్లో పోలీసులు విచారణ చేపట్టారని మంత్రి బొత్స వెల్లడించారు. టీడీపీ నేతలు రాజకీయంగా మాట్లాడుతున్నారని.. పేపర్ లీకేజీ జరగలేదని టీడీపీ వాళ్లు చెప్పగలరా అని ప్రశ్నించారు.
టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం ఎవరినీ వదిలిపెట్టదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రశ్నాపత్రాలు ఎక్కడ లీకయ్యాయో పోలీసులు విచారణ చేస్తున్నారన్నారు. తప్పు చేసిన ఎవరినైనా అరెస్ట్ చేస్తారని.. చట్టం, పోలీసులు వారి పని వారు చేసుకెళ్తారని బొత్స తెలిపారు. తప్పు చేయలేదని నారాయణ నిరూపించుకోవాలన్నారు. అమరావతి ల్యాండ్ పూలింగ్ కేసులో అక్రమాలు జరగకపోతే ఎందుకు కేసు పెడతారని బొత్స ప్రశ్నించారు.