NTV Telugu Site icon

Ambati Rambabu: ప్రాజెక్ట్‌ల పైనే కాదు, నీటి గురించి మాట్లాడే అర్హత కూడా చంద్రబాబుకు లేదు..

Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu: ప్రాజెక్ట్‌ల గురించే కాదు.. అసలు నీటి గురించి మాట్లాడే అర్హత కూడా చంద్రబాబుకు లేదంటూ ఫైర్‌ అయ్యారు మంత్రి అంబటి రాంబాబు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఎంపీలు కోటగిరి, మార్గాని భరత్‌, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించిన ఆయన.. ప్రాజెక్టు పనులపై వివరించారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.. 1995లో ముఖ్య మంత్రి అయ్యి తర్వాతి కాలంలో 14 ఏళ్లు సీయంగా వున్న చంద్రబాబు ఎప్పుడైనా పోలవరం గురించి మాట్లాడారా..? అని నిలదీశారు.. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకి లేదన్న ఆయన.. ప్రాజెక్ట్ ల గురించే కాదు, నీటి గురించి అసలు మాట్లాడే అర్హత లేదన్నారు.. ఆయన పాలనలో వర్షాలు పడవు అంటూ ఎద్దేవా చేశారు.. పోలవరంలో 72శాతం పనులు పూర్తి చేశామని చంద్రబాబు అనడం పచ్చి అబద్ధం అని ఫైర్‌ అయ్యారు.

Read Also: Mahesh Babu: అప్పుడు మహేశ్ బాబుకి హిట్ కావాలి, ఇప్పుడు మహేశ్ అంటేనే హిట్…

ఇక, ప్రతి పక్షాలు, వైసీపీకి వ్యతిరేకంగా వున్నవారు అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అంబటి రాంబాబు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చంద్రబాబు సర్వ నాశనం చేశారని ఆరోపించిన ఆయన.. కాఫర్ డ్యామ్ లు పూర్తి చేయకుండా డయా ఫ్రమ్ వాల్ కట్టడం తెలివి తక్కువ తనం అని మండిపడ్డారు.. అప్పట్లో దాని విలువ 4 వందలు కోట్లు.. హెడ్ వర్క్ విలువ 5,943 కోట్లు.. టీడీపీ హయాంలోనే 3,591 మాత్రమే ఖర్చు చేశారు.. కానీ, 7,422 కోట్ల అంచనాకి ప్రాజెక్టు వెళ్లిపోయిందన్నారు.. చంద్రబాబు అజ్ఞానం వల్ల ప్రాజెక్ట్ పనులు కుంటుపడ్డాయని విమర్శించారు.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో అత్యధికంగా ఖర్చు చేసింది వైసీపీ మాత్రమే అని స్పష్టం చేశారు.. అత్యధిక ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్ట్ పోలవరం.. శరవేగంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత వైసీపీ తీసుకుందన్న ఆయన.. పొరపాట్లకు తావులేకుండా పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం ఉందని.. పోలవరం ప్రాజెక్ట్ ను ప్రారంభించబోయేది సీఎం వైఎస్‌ జగన్‌ మాత్రమేనని ప్రకటించారు.. మరోవైపు.. పోలవరంపై చంద్రబాబుతో బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ సవాల్‌ విసిరారు మంత్రి అంబటి రాంబాబు.