NTV Telugu Site icon

Ambati Rambabu: పవన్‌ కల్యాణ్‌ను చూస్తే జాలేస్తోంది.. ఎవరి కోసం యుద్ధం చేస్తున్నారో స్పష్టత ఉందా..?

Ambati Rambabu

Ambati Rambabu

Minister Ambati Rambabu: మరోసారి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కల్యాణ్‌ ఏవేవో వ్యాఖ్యలు చేస్తున్నాడు.. ఆయన ఏదో సాధిస్తాడని నమ్మే వాళ్లకు చెబుతున్నాను.. పవన్‌ను చూస్తే జాలేస్తోంది.. వీర మహిళలు, జన సైనికులు ఎవరితో యుద్ధం చేయాలనుకుంటున్నారు? ఎవరి కోసం యుద్ధం చేస్తున్నారో మీకు స్పష్టత ఉందా..? అంటూ ప్రశ్నించారు.. మీ నాయకుడు ఎవరితో పొత్తులో ఉన్నాడు? బీజేపీతో పొత్తులో ఉన్నామంటారు… టీడీపీకి కన్ను కొడతారు.. చంద్రబాబు విదిలించే మెతుకుల కోసం తాపత్రయ పడుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు..

Read Also: Minister Gudivada Amarnath: అది జరిగితే బంగాళాఖాతంలో దూకడం తప్ప మరో మార్గం లేదు…!

నేను చంద్రబాబు దత్త పుత్రుడిని కాదు అని ఎందుకు చెప్పటం లేదు..? అని పవన్‌ కల్యాణ్‌ని ప్రశ్నించారు అంబటి రాంబాబు.. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే ధైర్యం పవన్ కల్యాణ్‌కు ఉందా? అని సవాల్‌ విసిరిన ఆయన.. ఈ నెల 15న విశాఖలో ర్యాలీ చేపట్టనున్నట్లు ముందుగా ప్రకటించింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీయే అన్నారు.. అయితే, పవన్‌ కల్యాణ్‌ అదే రోజు విశాఖలో పర్యటన పెట్టుకుని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.. ఉత్తరాంధ్రను రెచ్చగొడితే మాడి మసై పోతారు అంటూ హెచ్చరించారు.. తాము ఈ యాత్ర ఉత్తరాంధ్ర ప్రజలను చైతన్యవంతులను చేయటానికే నిర్వహిస్తున్నామన్న ఆయన.. అమరావతి రైతులది పాదయాత్ర కాదు, ఫేక్‌ యాత్ర.. ఉత్తరాంధ్ర వాసుల్ని రెచ్చగొడితే మాడి మసైపోతారు అని వ్యాఖ్యానించారు.. పాదయాత్ర చేసే వారు సూర్యదేవాలయానికి వెళ్తున్నారు.. భగభగమండే సూర్యుడు దగ్గరకు వెళతాం అంటున్నారు.. సూర్యుడు బుగ్గి చేసేస్తాడు.. అందుకే పాదయాత్ర విరమించి మీ చంద్రుడి (చంద్రబాబు) దగ్గరకు వెళ్లండి అంటూ సెటైర్లు వేశారు మంత్రి అంబటి రాంబాబు.

Show comments