కరోనా రక్కసి కోరలు చాస్తోంది. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో క్రమక్రమంగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఏపీలో సైతం కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే తెలంగాణ కరోనా ఉధృతి దృష్ట్యాల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అయితే ఏపీలో మాత్రం విద్యాసంస్థలు నడుస్తూనే ఉన్నాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారినపడుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ప్రతి రోజు కలెక్టర్ స్థాయిలో పాఠశాలల పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. కరోనా సోకిన ఉపాధ్యాయులకు తక్షణమే సెలవులు ఇస్తున్నామని, అన్ని స్కూళ్లలో పూర్తిస్థాయిలో శానిటైజ్ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలకు హాజరుకావాలని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఆయన సూచించారు.