Marine Fishing Ban: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో సముద్ర జలాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి చేపల వేట నిషేధం అమల్లోకి వచ్చింది. జూన్ 14వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ నిషేధాంక్షలు అమల్లో ఉంటాయని మత్స్యశాఖ ప్రకటించింది. ఈ నిషేధ కాలంలో వేటకు వెళ్లడం నేరంగా పరిగణిస్తారు, మత్స్యకారులు ఈ నిబంధనలను పాటించాలని పేర్కొన్నారు. కోస్టల్ ప్రాంతాల్లో గస్తీ కూడా ఏర్పాటు చేస్తున్నామని తేల్చి చెప్పారు. ఇక, రాష్ట్రంలో తిరుపతి జిల్లా తడ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు 1,027.58 కిలో మీటర్ల మేర విస్తరించిన సముద్ర తీరంలో సుమారు 65 మండలాల పరిధిలోని 555 మత్స్యకార గ్రామాల్లో 8.50 లక్షల మంది మత్స్యకారులు ఉండగా.. వీరిలో సముద్ర వేటపై ఆధారపడి 1.63 లక్షల మంది జీవనం కొనసాగిస్తున్నారు.
Read Also: AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ కీలక సమావేశం.. కీలక అంశాలపై చర్చ
అయితే, సముద్రంలో వేట నిషేధం సమయంలో ఎవరైనా సముద్రంలోకి వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఇక, కాకినాడ జిల్లాలో 24,500 మత్స్యకార కుటుంబాలు జీవిస్తున్నాయి. మెకనైజ్డ్ బోట్లు 483, మోటార్ బోట్లు 3800 ఉన్నాయి. ఇక, 419 సాంప్రదాయ బోట్లకు నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చారు. నిషేధాన్ని అమలు చేసేందుకు తీరంలో కోస్ట్ గార్డ్, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.