ప్రేమించుకోవడం.. పెద్దలు అంగీకరించకపోవడం.. పెద్దలను ఒప్పించలేక ఎక్కడికో వెళ్లిపోయి పెళ్లి చేసుకోవడం.. విడిచి ఉండలేక, కలిసి బ్రతకలేక.. ప్రాణాలు విడిచిన ఘటనలు ఎన్నో చూశాం.. తాజాగా. విశాఖ నగరంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం కలకలం రేపింది. మెడలో తాళి కట్టిన మరుక్షణమే వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిక్కోలు జిల్లా లావేరు, దూసి ప్రాంతాలకు చెందిన దామోదర్ (23), సంతోషి కుమారి సోమవారం విశాఖ చేరుకున్నారు. వీరద్దరూ రజక సామాజిక వర్గానికి చెందిన వారే. దాదాపు తెలిసిన కుటుంబాలకు చెందిన వ్యక్తులే. వీరికి తెలిసిన వారి వివాహం జరగ్గా ఆ పెళ్లిలో ఇద్దరూ చురుగ్గా పాల్గొన్నారు. అనంతరం స్నేహితులుగా మారి, ఆపై ప్రేమికులయ్యారని చెబుతున్నారు.
Read Also: Mohammad Azharuddin: టీమిండియా మాజీ కెప్టెన్ ఇంట విషాదం..
అయితే, ఇంతలో ఏం జరిగిందో ఏమో గానీ, సోమవారం సాయంత్రం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లలపాలెం రామాలయం సమీపంలో అయ్యన్ రెసిడెన్సీలో బస చేశారు.. కలిసి ఫోటోలు దిగారు. సంతోషి కుమారి మెడలో దామోదర్ అప్పుడే కట్టినట్టుగా తాళి కూడా కనిపిస్తోంది. కానీ, మంగళవారం సాయంత్రం వారు బసకు దిగిన రూమ్ నుంచి కొద్దిగా దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులొచ్చి తలుపులు తెరిచి చూసేసరికి ఇద్దరూ శవాలై కనిపించారు. తాడుతో ఉరేసుకున్నట్టు తేల్చారు. దీంతో స్థానికంగా ఉంటున్న వారి బంధువులు విషయం తెలుసుకుని హోటల్ వద్దకు వచ్చారు. ఇటీవలే వారిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారని, అంతకు మించి తమకేమీ తెలియదన్నారు. ప్రేమికుల మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు పోలీసులు.