మేడారం సమ్మక్క సారలమ్మ పై తాను చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగడంతో చిన్నజీయర్ స్వామి వివరణ ఇచ్చారు. తాడేపల్లిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ వివాదంపై చినజీయర్ స్వామి వివరణ. మహిళల్ని ఆదరించాలని భావించేవాడిని. మహిళల్ని, దేవతల్ని చిన్నచూపుతో మాట్లాడతామని అనుకోవడం పొరపాటు. పూర్వాపరాలు చూడాలి. మధ్యలో ఒకదాన్ని చూపించి విమర్శించడం హాస్యాస్పదం అన్నారు చినజీయర్ స్వామి.
ఇవాళ లక్ష్మీ దేవీ పుట్టిన రోజు. ఆగమ గ్రంథాలు ఇదే విషయాన్ని తెలుపుతున్నాయి. ఇవాళ అంతర్జాతీయ వైదిక మహిళా దినోత్సవంగా చెప్పాలి. మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రపంచంలోని మహిళలందరికీ మంగళాశాసనాలు తెలియ చేస్తున్నాం. ఎవరికి ఙానం విలక్షణంగా ఉంటే.. వారిని ఆరాధ్య స్థానం కల్పించాలని రామానుజాచార్యులు సూచించారు.
ఙానులైన ఆదివాసీలను గౌరవించే సంప్రదాయం ఉండాలని రామానుజాచార్యులు సూచించారు. రామానుజ పరంపరలో సామాజిక, ఆధ్యాత్మిక విప్లవం సృష్టించారు. 1938లోనే తూ.గో. జిల్లాలోని అత్తలూరులో శ్రీమన్నారాయణ హరిజన కాలనీ నిర్మాణం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల కోసం స్కూలును 2004లో ప్రారంభించాం. అవకాశం లేకే ఆదివాసీలు వెనకబడ్డారు. అవకాశం ఉంటే ఆదివాసీల్లో అద్భుతమైన ప్రగతి ఉంటుందన్నారు చినజీయర్ స్వామి.
సమాజం అనే వేదిక మీద అంతా కలిసి ముందుకు సాగాలి. ఒక వేదిక దొరికిందని రకరకాలుగా మాట్లాడడం మంచిది కాదు. ప్రజల్ని రెచ్చగొట్టడం తాత్కాలిక ప్రయోజనాల కోసమే. పబ్లిసిటీ కోసం మాట్లాడకూడదు. అమాయకులను రెచ్చగొట్టడం సులభం. సమాజ హితం కాంక్షించేవారు కూర్చుని ఆలోచించాలి. అంతా కలిసి చర్చించాలి.
నారీమణులందరికీ మంగళాశాసనాలు చేస్తున్నామన్నారు. లక్ష్మీదేవి పుట్టినరోజు సందర్భంగా ఆయన మాట్లాడారు. శ్రీరంగం క్షేత్రంలో అమ్మవారు, అయ్యవారు కలిసి వుంటారు. అమ్మకలిసి వుండగానే మనం అయ్యవారిని మనం ఆశ్రయించాలి. పూజించాలి.ఈరోజు విలక్షణమయిన రోజు. సమాజ హితం కార్యక్రమంలో కలిసి పనిచేద్దాం. అందరినీ సమానంగా చూద్దాం. చెట్టుపుట్టగట్టుని అంతా గౌరవించాలి. ప్రతి పండుగకు అది పాటిస్తున్నాం. ఒక జంతువు, పక్షి, ఆకు, మనం తినే ఆహారం కలిసి వుంటుంది. దసరా నాడు జమ్మిచెట్టుని పూజిస్తాం. మనం ప్రకృతిని, ప్రాణికోటిని పూజిస్తాం. అందరికీ మంచిని నేర్పుదాం అన్నారు చినజీయర్ స్వామి.
20 ఏళ్ళ పూర్వం మాట్లాడిన మాటల్లోంచి అవి బయటపెట్టారు. దానికి పూర్వం, పరం వుంటుంది. ఆ దేవతలు స్వర్గం నుంచి దిగిరాలేదు. గ్రామసీమల్లో వుండే వ్యక్తులు సమ్మక్కసారలమ్మ, ఆదివాసీలు అయితే నాలెడ్జ్ పరంగా వారిని ఉత్తములుగా భావించాలి. వారి ప్రతిభ ఆరాధ్య అర్హత పొందారు. అసాంఘిక కార్యక్రమాన్ని ప్రోత్సహించవద్దు.సమతామూర్తి విగ్రహం చూడడానికి టికెట్ పెట్టాం. దాని నిర్వహణ కోసం పెట్టాం. అంతేగానీ అక్కడ పూజలకు, ప్రసాదాలకు టికెట్లు లేవు. మీడియా కోడిగుడ్లపై ఈకలు లాగవద్దు. విషయం తెలుసుకోకుండా ప్రశ్నలు అడగవద్దన్నారు చినజీయర్ స్వామి.
గిరిజనుల ఆరాధ్య దైవం సమ్మక్క-సారలమ్మపై త్రిదండి చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించిన సంగతి తెలిసిందే. తెలంగాణ పౌరుషం, సంస్కృతికి ప్రతీకలైన తల్లులను అవమానపరిచిన చినజీయర్‌ను యాదగిరి గుట్ట ఆగమశాస్త్ర సలహాదారుడి బాధ్యతల నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. మన భక్తి విశ్వాసాలపై దాడి చేసినందుకు ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.