బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాన్ క్రమంగా తీరం వైపు దూసుకొస్తుంది.. అయితే, అసని కదలికలో వేగం తగ్గింది.. నెమ్మదిగా కదులుతోందని విపత్తుల సంస్థ ప్రకటించింది.. అసని తుఫాన్‌పై తాజా బులెటిన్ విడుదల చేశారు ఏపీ విపత్తుల సంస్థ డైరెక్టర్ డా. బీఆర్ అంబేద్కర్.. అసని రేపు ఉదయానికి వాయుగుండంగా బలహీనపడుతుందని పేర్కొన్నారు.. గడిచిన 6 గంటల్లో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో పశ్చిమవాయువ్య దిశగా కదిలిందని.. మూమెంట్ నెమ్మదిగా ఉందన్నారు.. ప్రస్తుతం మచిలీపట్నానికి 40 కిలోమీటర్లు, నరసాపురంకు 50 కిలోమీటర్లు, కాకినాడకు 130 కిలోమీటర్లు, విశాఖపట్నంకు 270 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యిందని.. కొన్ని గంటల్లో వాయువ్య దిశగా పయనించి కొనసీమ అంతర్వేది వద్ద భూభాగంపైకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
Read Also: Marital Rape: భార్యతో బలవంతపు శృంగారం.. భిన్న తీర్పులు..!
ఇక, రాత్రికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ ప్రకటించింది.. ఈరోజు కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని.. అక్కడక్కడ భారీ నుంచి అతిభారీవర్షాలు పడే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది. రేపు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని.. అక్కడక్కడ భారీ నుంచి అతిభారీవర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని విపత్తుల సంస్థ వెల్లడించింది.