చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో భూ మాఫియా రెచ్చిపోయి కబ్జాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. వెదురుకుప్పం మండలం లోని కొంతమంది నాయకుల అండదండలతో ఫేక్ పట్టాదారు పాసు పుస్తకాలు తయారుచేసి విచ్చలవిడిగా దందా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఆళ్ల మడుగు, దేవరగుడిపల్లి, వెదురుకుప్పం, చుట్టుపక్కల ప్రాంతాలలో ఇటువంటి సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి,
ఒక నాయకుడు ఏకంగా గుట్టని,చెరువుల్ని కూడా వదలకుండా గత కొన్ని సంవత్సరాలుగా తన సొంత ప్రయోజనాల కోసం వాడేశారు. తన పేరు మీద తన బంధువుల పేరు పైన సుమారు 60 ఎకరాలు రెవెన్యూ పాసుబుక్‌లు స్వంతంగా తయారు చేసుకుని వాటిని ఆన్లైన్ లోకి ఎక్కించి వాటిని వివిధ బ్యాంకులలో పెట్టి రుణాలు తీసుకోవడం జరిగింది. తనకు కావాల్సిన బంధుగణానికి తప్పుడు పత్రాలు సృష్టించి ఇవ్వడం, ఎదురు తిరిగిన వారిపై వైసీపీ పేరు ఉపయోగించుకొని పోలీసుల ద్వారా బెదిరించడం చేస్తున్నారు.
అతని పేరు చెబితే రెండు మండలాల రైతులు గజగజా వణుకుతారు. కొద్దిగా ఆర్థికంగా ఉండి చదువు రాకుండా ఉంటే చాలు అంతే ఈ నాగార్జున రెడ్డి గ్యాంగ్ వారి పొలాలపై పాసుబుక్కులు సృష్టించి ఆన్లైన్లో ఉన్న పేర్లను తొలగించి వీళ్ళకు కావాల్సిన వాళ్ళ పేర్లు నమోదు చేయించేస్తాడు, ప్రభుత్వ భూమి గుట్టలు ,చెరువులను సైతం కొనుగోలు కింద సృష్టిస్తాడు. వీరి బాధితులు కోకొల్లలు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి దృష్టికి తీసుకొని వెళ్లగా నా చేతిలో ఏమీ లేదని బహిరంగంగానే తిప్పి పంపుతున్నా. బాధితులు చాలామంది వున్నారంటూ స్వయంగా డిప్యూటీ నారాయణస్వామి చెప్పడంతో రైతులు నోరెళ్లబెట్టారు, కొంతమంది రైతులు ధైర్యం చేసుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ ముట్టడించి, తమ నిరసనను తెలియజేసారు, ఎమ్మార్వో స్పందిస్తూ ఫిర్యాదు రూపంలో అందజేయండి పదిరోజుల్లో మీకు అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు నిరసన విరమించారు.