చిన్న చిన్న వివాదాలే చినికి చినికి గాలివానగా మారుతున్న రోజులివి. తాజాగా ఏపీలో జరిగిన ఒక ఘర్షణ వీడియో వైరల్ అవుతోంది. అనకాపల్లిజిల్లా గవరవరంలో భూ తగదా రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. తాహశీల్ధార్ ఎదుటే పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు. ఈ ఫైటింగ్ సీన్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చోడవరం మండలం, గవరవరం లో సర్వే నంబర్ 170/10 గల భూవివాదం పై వివాదం ఉంది. హద్దులు విషయంలో పరిష్కారం కోసం రైతులు రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు.
సర్వే చేయించేందుకు సిబ్బందితో సహా పొలంలోకి వెళ్ళారు తాహశీల్ధార్. ఒక వర్గం తర్వాత మరో వర్గం వెర్షన్ చెప్పాలని సూచించగా ఇంతలో మాటామాటా పెరిగింది. కంట్రోల్ తప్పిన ఇరువర్గీయులు కలియబడి కొట్టుకున్నారు.ఇదంతా చూస్తూ వారిని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు తాహశీల్దార్. వివాదం రేగిన పొలంలోనే ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
గ్యాస్ సిలిండర్ లీకై… తగులబడిన ఇల్లు
విజయవాడ గ్రామీణ మండలం నున్న గ్రామంలో గ్యాస్ సిలిండర్ లీకై అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక కుమ్మర బజారులో ఓ గృహంలో వంట చేస్తుండగా ఒక్కసారిగా రెగ్యులేటర్ నుంచి మంటలు రావడంతో పరుగులు తీశారు గృహ యజమానులు. ఇల్లు పూర్తిగా దగ్ధం కాగా భారీగా ఆస్తి నష్టం జరిగింది. ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పి వేశారు అగ్నిమాపక సిబ్బంది.