కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రియుడితో వెళ్తూ బైక్ నుంచి కింద పడి ఇంజినీరింగ్ యువతి మృతి చెందిన ఘటన ఓర్వకల్ మండలం ఎంబాయి వద్ద చోటు చేసుకుంది. వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డి పల్లికి చెందిన ఓ యువతి.. ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈనెల19న ఆ యువతికి వేరే యువకుడితో వివాహం జరగాల్సి ఉంది. అయితే ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం లక్ష్మిపురానికి చెందిన వెంకటేశ్వర్లుని ఆమె ప్రేమించినట్టుగా తెలుస్తోంది.
ఈరోజు తన ప్రియుడితో కలిసి బైక్ పై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బైక్ నుంచి కిందపడిపోయిన ఆమెను హుస్సేనాపురం ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. దీంతో ఆమె మృత దేహాన్ని ఆమె ప్రియుడు నంద్యాల వైపు తీసుకెళ్తుండగా పాణ్యం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని కర్నూలు జీజీహెచ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. అయితే తమ కూతురు మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో తమకూతురు చనిపోలేదంటున్నారు. మృతిపై విచారణ జరిపించాలని పోలీసులను కోరారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.