CI Serious On TDP Protest: మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించిన హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు శనివారం నాడు కుప్పంలో టీడీపీ నేతలు ఆందోళన నిర్వహించారు. ఇందులో భాగంగా టీడీపీ నేతలు ఎంపీ గోరంట్ల మాధవ్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు టీడీపీ నేతలను అడ్డుకుని దిష్టిబొమ్మను పక్కకు లాగేశారు. దీంతో టీడీపీ నేతలు, కుప్పం అర్బన్ సీఐ శ్రీధర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమ అనుమతి లేకుండా దిష్టిబొమ్మను ఎలా దహనం చేస్తారని చంద్రబాబు పీఏ మనోహర్‌ను సీఐ శ్రీధర్ ప్రశ్నించారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేస్తే తప్పేంటని, ఎందుకు అడ్డుకుంటున్నారని మనోహర్ సీఐను నిలదీశారు. ఎంపీ మాధవ్ మీ స్నేహితుడు అని అడ్డుకుంటున్నారా అంటూ సూటిగా ప్రశ్నించారు.
Read Also: Rakshabandhan 2022: సోదరికి గిఫ్ట్‌ల గురించి ఆలోచిస్తున్నారా?.. ఈ బహుమతులు ఇవ్వండి
అయితే సీఐ శ్రీధర్ స్పందిస్తూ ఎంపీ గోరంట్ల మాధవ్ తన స్నేహితుడు కాదని, పోలీసుల విధుల్లో భాగంగానే అడ్డుకుంటున్నట్టు వివరించారు. న్యూడ్ వీడియోలు చేసేవాళ్లు చాలామందే ఉంటారని.. మీరు చేయలేదా అంటూ టీడీపీ నేతలను సీఐ శ్రీధర్ ప్రశ్నించారు. ఎంపీ మాధవ్ తప్పు చేశారని తేలితే చట్టబద్ధంగా శిక్ష నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు. అయినా తప్పు చేస్తే దిష్టిబొమ్మను కాలుస్తారా? దిష్టిబొమ్మనెందుకు దేశాన్ని కాల్చండి అంటూ సీఐ వివాదాస్పద వ్యాఖ్యలు చేశార. ఈ ఘటనకు సంబంధించి చంద్రబాబు పీఏ మనోహర్ సహా 15 మంది టీడీపీ నేతలపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. కాగా దేశాన్ని కాల్చండి అంటూ సీఐ శ్రీధర్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. కాగా సీఐ శ్రీధర్, ఎంపీ గోరంట్ల మాధవ్ ఒకే బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారులు అని ప్రచారం జరుగుతోంది.