Perni Nani: పల్నాడులో జంట హత్యల కేసులో అన్యాయంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులను ఇరికించారు అని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఇలాంటి పాపాలు మూటకట్టుకుని ఏం సాధిస్తారని మండిపడ్డారు. హత్యకు గురైన వారు, చేసినవారు టీడీపీ వారేనని స్వయంగా జిల్లా ఎస్పీ చెప్పారు.. గ్రామంలోని రెండు టీడీపీ వర్గాల మధ్య ఆధిపత్య పోరులోనే హత్యలు జరిగాయని తెలిపారు.. కానీ, ఎఫ్ఐఆర్‌లో వైసీపి నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడి మీద కేసు నమోదు చేశారు.. హత్య కేసులోని ముద్దాయిల్లో ఒక్కరైనా వైసీపి జెండా పట్టుకున్నారా.. ఏనాడైనా ఫ్యాను గుర్తుకు ఓటేశారా అని పేర్నినాని ప్రశ్నించారు.
Read Also: Iran: ఇరాన్‌లో ముగ్గురు భారతీయులు అదృశ్యం.. ఆందోళనలో కుటుంబ సభ్యులు
ఇక, ముద్దాయి కొత్త కారు కొంటే టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి దాన్ని ప్రారంభించారని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. అదే కారులో వెళ్ళి చంద్రబాబును కలిశారు.. అలాంటి వ్యక్తి వైసీపీ అని ఎలా చెప్తారని మండిపడ్డారు. ఎన్టీఆర్‌ని చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు.. అదే వెన్నుపోటు త్వరలోనే లోకేష్.. చంద్రబాబును పొడుస్తాడు అని జోస్యం చెప్పుకొచ్చాడు. పార్టీనీ, సీఎం కుర్చీని లాక్కోబోతున్నారు.. చంద్రబాబు అక్కచెల్లెళ్ళు ఎక్కడ ఉన్నారు.. ఏనాడైనా వారు చంద్రబాబు ఇంటి గడప తొక్కారా.. హైదరాబాద్, కుప్పం, అమరావతిలో వందల కోట్లతో ఇళ్లు కట్టుకుని గృహ ప్రవేశం చేస్తే అక్క చెల్లెళ్ళు ఎవరైనా వచ్చారా.. రాజమహల్, జైపూర్ ప్యాలెస్ లాంటి ఇళ్లు కట్టుకుని తోబుట్టువులను ఎందుకు పిలవలేదు.. కొత్త ఇంట్లో పాలు పొంగించేది ఇంటి ఆడపిల్లలే.. మరి ఏనాడైనా ఆ ఆడ పిల్లలు చంద్రబాబు ఇంటికి ఎందుకు రావటం లేదు అని పేర్నినాని ఎద్దేవా చేశారు.
Read Also: Kamal : కమల్ “తగ్ లైఫ్” బ్యాన్.. కన్నడ సంఘాల ఫైర్.. అసలు ఏంటీ గొడవ?
అలాగే, వైసీపీ నేత పేర్నినాని అన్నారు. రాష్ట్రంలో మహిళలకి అన్యాయం జరిగితే విచారణ ఉండదు.. పిఠాపురంలో దళితులను వెలేస్తే విచారణ ఉండదు.. కానీ, పవన్ కళ్యాణ్ సినిమాకి ఇబ్బంది అవుతుందనుకుని థియేటర్లపై విచారణ చేస్తున్నారు.. సినిమా హాళ్ల వారు మీటింగ్ పెట్టుకుని బంద్ చేస్తామని నిర్ణయం తీసుకుంటే.. ఆ విషయం ప్రభుత్వానికి తెలియదు.. కనీసం ఆ శాఖ మంత్రికి కూడా బంద్ గురించి తెలీదు అన్నారు. ఒక సినిమా ప్రొడ్యూసర్ చెప్పేదాకా ప్రభుత్వానికి ఈ విషయం తెలియదు అని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో ఇంటిలిజెన్స్ ఏం పని చేస్తోంది.. పోలీసులందరినీ వైసీపీ నేతలను వేధించటానికి మాత్రమే కూటమి ప్రభుత్వం వాడుకుంటోంది.. శాంతి భద్రతలను కాపాడటానికి కాదన్నారు. అందుకే చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి.. ఇంతటి దిక్కు మాలిన ప్రభుత్వం మరొకటి లేదు.. సినిమాల విషయంలో మా హయాంలో తీసుకున్న నిర్ణయాలే ఇప్పటికీ అమలు చేస్తున్నారు.. మా నిర్ణయాలు తప్పయితే ఈ సంవత్సర కాలంగా ఎందుకు అమలు చేస్తున్నారని పేర్నినాని మండిపడ్డారు.