NTV Telugu Site icon

Amit Shah and Junior NTR Meet: జూనియర్‌ ఎన్టీఆర్‌తో అధికార మార్పిడి.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..

Kodali Nani

Kodali Nani

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ డిన్నర్‌ భేటీ.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో రచ్చ రేపుతోంది.. ఈ భేటీలో సినిమాకు సంబంధించిన చర్చ, సీనియర్‌ ఎన్టీఆర్‌ గురించి ప్రస్తావన వచ్చిందని బీజేపీ నేతలు చెబుతున్నా.. ఇది పక్కా రాజకీయ చర్చ జరిగిన సమావేశంగా ప్రచారం సాగుతోంది.. ఈ తరుణంలో షా-ఎన్టీఆర్‌ భేటీపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని.. ఈ పరిణామాలపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. రాజకీయ వ్యూహంతోనే అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ అన్నారు. రాజకీయ ప్రయోజనాలు లేకుండా అమిత్ షా, నరేంద్ర మోడీ ఎవరితోనూ సమావేశం కారని వ్యాఖ్యానించారు.

Read Also: Undavalli Arun Kumar: రెండు తెలుగు రాష్ట్రాల్లో తారక్‌ని బీజేపీ వాడుకుంటుంది

దేశ వ్యాప్తంగా బీజేపీ తరపున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసే అవకాశం ఉందని జోస్యం చెప్పారు కొడాలి నాని.. ప్రచారం చేయటానికి ఎన్టీఆర్.. బీజేపీలో చేయాల్సిన అవసరం ఉండదన్న ఆయన.. టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్‌తో అధికార మార్పిడి చేసే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో జరిగిన పరిణామాలు టీడీపీలో వచ్చే అవకాశం ఉందన్న ఆయన.. చంద్రబాబు ఏక్ నాథ్ షిండే.. ఎన్టీఆర్ నుంచి పార్టీని ఏక్ నాథ్ షిండే లానే లాక్కున్నాడని విమర్శించారు. ఇక, చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడి హోదా, పార్టీ అధ్యక్షుడు పదవి ఒకేసారి ఊడతాయని జోస్యం చెప్పారు. 73 ఏళ్ళ వయసులో ఎన్టీఆర్‌కు చంద్రబాబు ఏ గతి పట్టించాడో అదే పరిస్థితి ఇప్పుడు చంద్రబాబు పట్టనుందన్నారు.

అయితే, ఎన్టీఆర్‌ టీడీపీ, బీజేపీ తరపున ప్రచారం చేసినా వైసీపీకి ఎలాంటి ప్రమాదం లేదన్నారు.. కానీ, ఎన్టీఆర్ వస్తే.. ఓటింగ్‌ శాతం పెరుగుతుందన్నారు. ఇక, ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో కొడాలి నాని చేసిన సంచలన వ్యాఖ్యలను చూసేందుకు కింది వీడియోను క్లిక్‌ చేయండి..