ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం అమలుచేయాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని కోరారు. ఆంధ్ర ప్రదేశ్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అమలు, విజయవాడ రైల్వే స్టేషన్ లో సౌకర్యాలను మెరుగుపరచాలని ఆయన కేంద్రమంత్రిని కోరారు. లోక్ సభలో దీనినే ప్రధాన అంశంగా ప్రస్తావించారు విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్. ఏపీ రాష్ట్రానికి సంబంధించి పలు సమస్యలను, సౌత్ కోస్ట్ రైల్వే జోన్లు పనితీరు గురించి మాట్లాడారు.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి మోడీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. 2019లో ఫిబ్రవరి 27 న ఆంధ్ర రాష్ట్రానికి సౌత్ రైల్వే జోన్ ప్రకటించారు. రైల్వే జోన్ అంశం ఆచరణ లోకి ఎప్పుడు వస్తుంది. రైల్వే జోన్ ఏర్పాట్లు జరుగుతున్నాయా అని రైల్వే మంత్రిని కేశినేని నాని ప్రశ్నించారు.
దీనికి సమాధానంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే సంబంధిత భవనాల నిర్మాణానికి కావాల్సిన స్థలం, డి పి ఆర్ వంటి పనులు జరుగుతున్నాయని త్వరలోనే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అమలులోకి వస్తుందని సమాధానమిచ్చారు. విజయవాడ రైల్వే స్టేషన్ లో సౌకర్యాలను మెరుగుపరచాలని, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడ లోకసభ నియోజకవర్గం మనదేశంలో 4వ అతి ప్రాచీనమైన రైల్వేస్టేషన్ అని కేశినేని నాని తెలిపారు.
కాన్పూరు, హౌరా, ఢిల్లీ రైల్వే స్టేషన్ల తర్వాత స్థానం విజయవాడ. “మొఘల్ సరాయు” తర్వాత అత్యధికంగా రద్దీగా ఉండే రెండో రైల్వే స్టేషన్ విజయవాడ. 256 ప్యాసింజర్ రైళ్ళు, 140 గూడ్స్ రైళ్ళు ప్రతిరోజూ 1.4 లక్షల ప్రయాణికులతో, సంవత్సరానికి ఐదు కోట్ల మంది ప్రయాణికులు విజయవాడ రైల్వే స్టేషన్ గుండా ప్రయాణం చేస్తుంటారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఇలాంటి రైల్వే స్టేషన్ లో చాలా తక్కువ సౌకర్యాలతో ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారని, ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ లాగా సౌకర్యాలు కల్పించాలని కేశినేని నాని కోరారు. కేశినేని నాని ప్రస్తావించిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు.