Mudragada Padmanabham Passes Away: కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో పాటు క్యాన్సర్, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ కీలక అధ్యాయం ముగిసింది.
1953 జనవరి 22న తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ పద్మనాభం ప్రజా జీవితంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. 1978లో తొలిసారిగా పత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం 1983, 1985లో తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించి, ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు.
తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన, అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో కూడా మంత్రి పదవిని నిర్వహించారు. మొత్తం ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి కాకినాడ లోక్‌సభ సభ్యుడిగా (1999) ఎన్నికై ప్రజాప్రతినిధిగా సేవలందించారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా కాపు సామాజిక వర్గ హక్కుల కోసం ఉద్యమించిన ప్రముఖ నేతగా ముద్రగడ పద్మనాభం ప్రత్యేక గుర్తింపు పొందారు. కాపు ఉద్యమంతో కీలక భూమిక పోషించిన ఆయన.. గత ఎన్నికల ముందు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలివకపోతే.. తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించిన ఆయన.. కూటమి విజయం తర్వాత ఇకపై, నా పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డి అంటూ ప్రకటించుకున్న విషయం విదితమే.. ఇక, ఆయన మరణవార్తతో రాజకీయ నాయకులు, అభిమానులు, కాపు సంఘాల ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పిస్తున్నారు.

