ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ, తెలంగాణలో తమ పార్టీదే ఆధిపత్యం అంటున్నారు పాల్. కాంగ్రెస్ పని అయిపోయిందని, ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేసేది ప్రజాశాంతి పార్టీయే అన్నారు ఆ పార్టీ చీఫ్ కేఏ పాల్. రాబోయే ఎన్నికలపైనే తాను ఫోకస్ పెట్టానంటున్నారు. ఆ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంటు స్థానం మినహా ఏపీ, తెలంగాణలోని అన్ని లోక్‌సభ స్థానాల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దక్షిణ భారత రాష్ట్రాలతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోని 175 స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని చెప్పుకొచ్చారు. ఏపీ, తెలంగాణలో తామే బలమయిన శక్తిగా ఎదుగుతాం అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, జనసేనకు ఎలాంటి ఓటు బ్యాంకు లేదని అమిత్ షాతో భేటీ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఓటు బ్యాంకు లేని పవన్ కల్యాణ్ వెంట ఎందుకు పడుతున్నారని అమిత్ షాను ప్రశ్నించానన్నారు. దానికి మంత్రి మాట్లాడుతూ.. తాము ఆయన వెంట పడలేదని, ఆయనే తమ వెంట పడుతున్నారని చెప్పారని కేఏ పాల్ అన్నారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి కేంద్రహోంమంత్రితో మాట్లాడానని, తనకు ఆయన భరోసా ఇచ్చారన్నారు. ఏపీ, తెలంగాణల్లో అన్నిటా పోటీచేస్తామని, సత్తా చాటుతామంటున్నారు పాల్. తెలంగాణ డీజీపీ తనకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని, కానీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు అపాయింట్ మెంట్ ఇచ్చారంటే తన సత్తా ఏంటో తెలుసుకోవాలన్నారు.
KA Paul Meets Amit Shah: అమిత్ షాతో కేఏ పాల్ భేటీ.. నాకు భరోసా ఇచ్చారు..!