ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లు తెరుచుకున్నాయి. కరోనా కారణంగా రాష్ట్రంలో నెలల తరబడి మూతబడ్డాయి స్కూళ్లు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధులతో పాఠశాలలు సందడిగా మారాయి. కరోనా భయంతో తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపించరేమోనని ఉపాధ్యాయులు ఆందోళన చెందారు. ఐతే…అందుకు భిన్నంగా మొదటి రోజే 60 శాతం కంటే మించి విద్యార్ధులు ప్రత్యక్ష తరగతులకు హాజరయ్యారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ బడిబాట పడుతున్నారు పిల్లలు. తమ స్నేహితులను కలుసుకోవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటిస్తూ ఉపాద్యాయులు తరగతులను నిర్వహిస్తున్నారు. మాస్కులు… శానిటైజర్లు..భౌతిక దూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరో వారం పది రోజుల్లో విద్యార్థులు పూర్తిశాతం హజరవుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ కాలేజీలలో మాత్రం మొదటి రోజు చాలా చోట్ల తరగతి గదులన్నీ ఖాళీగానే దర్శనమిచ్చాయి. 18 నుంచి ప్రయివేట్ కాలేజీలను తెరుస్తామని యాజమాన్యాలు చెపుతున్నాయి. మరోవైపు ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. దీంతో మరో పది రోజుల వరకు ఇదే పరిస్థితి ఉండొచ్చని భావిస్తున్నారు.