ఏపీలో కొత్త పీఆర్సీపై రగడ జరుగుతున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగసంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. దీంతో ఉద్యోగ సంఘాలు అన్ని ఏకతాటిపైకి వచ్చి పీఆర్సీ సాధన సమితి గా ఏర్పడి సమ్మెకు సిద్ధమయ్యాయి. అంతేకాకుండా పీఆర్సీపై స్పష్టత లేదని, పీఆర్సీ పై స్పష్టత వచ్చే వరకు జనవరి నెల నుంచి ప్రభుత్వం అమలు చేస్తానన్న కొత్త జీతాలకు బదులు పాత జీతాలే అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ఉద్యోగ సంఘాల కోరికను మన్నించలేదు.
జనవరి నెల జీతాలను కొత్త పే స్కేలు ప్రకారమే అమలు చేసినట్లు ఆర్ధిక శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, పెన్షనర్లకు 2022 రివైజ్డ్ పే స్కేల్ ప్రకారం చెల్లించనున్నట్టు ఆర్థిక శాఖ తెలిపింది. అంతేకాకుండా ఉద్యోగులు, పెన్షనర్లు తమ పే స్లిప్పులను పేరోల్ డాట్ హెర్బ్ డాట్ ఏపీ సీఎఫ్ ఎస్సెస్ వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఆర్ధిక శాఖ స్పష్టం చేసింది. ప్రతీ ఉద్యోగి మొబైల్ ఫోన్ కు కూడా జీతాలకు సంబంధించిన సంక్షిప్త సమాచారం పంపినట్లు ఆర్ధిక శాఖ పేర్కొంది.