జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని కలవనున్నారు. ఏపీలో జనసేన శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారనే అంశాన్ని ఆయన డీజీపీ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఇటీవల కోనసీమ అల్లర్ల కేసులో పలువురు జనసేన నేతల పేర్లను పోలీసులు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జనసేన నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం, వేధింపులకు గురిచేస్తున్న తీరుపై పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని బృందం డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డితో చర్చించాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించిందని జనసేన పార్టీ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది.
ఈ మేరకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులపై ఈ సందర్భంగా డీజీపీ దృష్టికి తీసుకువెళ్లామని ఆయన లేఖలో ప్రస్తావించారు. ఈ అంశాలపై చర్చించేందుకు తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని డీజీపీని నాదెండ్ల మనోహర్ కోరారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఓ ట్వీట్ ద్వారా తెలియజేసింది. మరోవైపు మంత్రి జోగి రమేష్ ఇలాకాలో గత రెండు నెలలుగా జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలకు జనసేన నాయకులు అడ్డుకట్ట వేసినట్లు జనసేన పార్టీ ట్వీట్ చేసింది.