రాష్ట్రంలో అధిక వడ్డీల భారి నుంచి చిరు వ్యాపారులను రక్షించేందుకు ఏపీ ప్రభుత్వం జగనన్నతోడు పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 22న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘జగనన్న తోడు’ మూడో దశను ప్రారంభిస్తారని పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఫిబ్రవరి 14 వరకు 9,05,023 మంది లబ్ధిదారులను గుర్తించినట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 6,91,530 మంది లబ్ధిదారులు బ్యాంకు రుణాలు పొందారని, మూడో దశలో మరో 1,57,760 మందికి రుణాలు అందజేస్తామని తెలిపారు.
జగనన్న తోడు పథకంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. చిరు వ్యాపారులు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం చొరవ తీసుకుని వారికి ఆర్థిక సాయం అందించిందన్నారు. రానున్న రోజుల్లో వీలైనంత ఎక్కువ మంది అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ‘వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ’, ‘వైఎస్‌ఆర్ పెన్షన్ కానుక’ పథకాల పురోగతిని కూడా ఆయన సమీక్షించారు.