Jagananna Mana Bhavishyath: వైసీపీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతోంది. పార్టీ శ్రేణులను వచ్చే ఎన్నికలకు సమాయత్తం చేస్తోంది. ఇక నుంచి నిత్యం పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజల్లో ఉండే విధంగా కార్యాచరణపై కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా శుక్రవారం నుంచి జగనన్నే మా భవిష్యత్తు అనే పేరుతో కార్యక్రమానికి వైసీపీ పిలుపు ఇచ్చింది. మా నమ్మకం నువ్వే జగన్ ఈ క్యాంపైన్‌కు ట్యాగ్ లైన్. ఈ నెల 20వ తేదీ వరకు అంటే 14 రోజుల పాటు ఈ క్యాంపైన్ జరుగనుంది. పార్టీ సైనికులుగా అభివర్ణిస్తున్న 7 లక్షల మంది గృహసారధులు, సచివాలయ కన్వీనర్లు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జులు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల వెల్లడించారు.
Read Also: Off The Record: గల్లా జయదేవ్ ఎందుకలా..? గుంటూరుకు దూరమైనట్టేనా?
ఈ క్యాంపైన్‌లో భాగంగా గృహసారధులు ఇంటింటికీ వెళతారు. చెప్పాడంటే చేస్తాడంతే, నిన్ను నమ్మం బాబు అనే సైడ్ హెడ్డింగ్‌లతో ఉన్న పాంప్లెట్లను ఇస్తారు. గత ప్రభుత్వం మాట ఇచ్చి తప్పిన విషయాలు, తమ ప్రభుత్వం చేసిన పనులను వారికి వివరిస్తారు. తర్వాత ప్రజా మద్దతు పేరుతో ఐదు ప్రశ్నలు ఉన్న మరో సర్వే కాగితంపై ఆ ఇంట్లో వారి నుంచి అభిప్రాయాలు తీసుకుంటారు. ప్రభుత్వం పట్ల, జగన్ పట్ల ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో ఈ సర్వే ద్వారా అంచనా వేసే ప్రయత్నం పార్టీ చేయనుంది. ఈ ప్రజా మద్దతు పేపర్లు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వస్తాయి. అభ్యంతరం లేకపోతే డోర్, మొబైల్ స్టిక్కర్లను ఆ ఇంట్లో వారికి ఇస్తారు. ఈ స్టిక్కర్ల పై మా నమ్మకం నువ్వే జగన్ అనే నినాదం, జగన్ ఫోటో ఉంటాయి. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళేందుకు అవకాశం ఉన్న జగనన్నే మా భవిష్యత్తును పార్టీ హైకమాండ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.