ఏపీలో జగన్ మోహన్ రెడ్డి పాలనలో కీలక మార్పులు రానున్నాయా? కేబినెట్లో మార్పులు, చేర్పులకు రంగం రెడీ అయిందా? ముహూర్తం కూడా పెట్టేశారా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. జగన్ తన టీంలో పెను మార్పులకు సిద్ధం అవుతున్నట్టు తాడేపల్లి నుంచి సమాచారం అందుతోంది. మొదట మంత్రివర్గ ప్రక్షాళన, ఆతర్వాత పార్టీ ప్రక్షాళన చేస్తారని తెలుస్తోంది.
ఇదంతా పూర్తయ్యాక అధికారుల ప్రక్షాళన వైపు జగన్ అడుగులు వేస్తారని భావిస్తున్నారు. చివరలో తన కుటుంబానికి సంబంధించి అతి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదంటున్నారు. ఏపీ క్యాబినెట్ విస్తరణ తొలగింపులకు మంచి ముహూర్తం కూడా నిర్ణయించారు జగన్. కేబినెట్ పునర్నియామకానికి ఫిబ్రవరి 18ని శుభ ముహూర్తంగా భావిస్తున్నారు.
అంతేకాదు మూడు రాజధానుల అంశం కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేకపోలేదంటున్నారు. వైజాగ్ ని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటిస్తూ మార్చి 4 న అసెంబ్లీలో మండలిలో బిల్లు పెట్టే అవకాశం వుందని సమాచారం. రాష్ట్రంలోని ప్రతి అధికారికి స్థానచలనం కలిగే అవకాశం వుంది. అలాగే, ఐఏయస్ నుండి ప్యూన్ వరకు పార్టీ పరంగా అన్ని పదవులభర్తీ చేస్తారు. పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు జరగనున్నాయి. కొత్త వారికి, యువతకు అవకాశం కల్పించాలని జగన్ యోచిస్తున్నారు.
త్వరలో తన కుటుంబం నుండి ఒకరు లేదా ఇద్దరు ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తారంటున్నారు. రాజకీయాల్లో తన నమ్మినబంటుకి ముఖ్యమైన శాఖలో మంత్రిగా అవకాశం కల్పిస్తారంటున్నారు. తనను నమ్ముకున్న వారికి భారీ ఎత్తున పార్టీలో ప్రభుత్వంలో పదవులు ఇచ్చి వారి సేవలు వినియోగించుకుంటారని తెలుస్తోంది. పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న వారిని పక్కన పెట్టనున్నారు జగన్. అసలు జగన్ ఎవరికి బెర్త్ కేటాయిస్తారు? ఎవరికి ఎర్త్ పెడతారనేది హాట్ టాపిక్ అవుతోంది. మరికొద్ది రోజుల్లో దీనిపై ఒక క్లారిటీ రానుంది.