అన్నమయ్య జిల్లాలో అమర జవాన్ రాజశేఖర్ కు కన్నీటి వీడ్కోలు పలికారు. ఈనెల 16న జమ్ముకాశ్మీర్ లో జరిగిన దుర్ఘటనలో అన్నమయ్య జిల్లాకు చెందిన తెలుగు జవాన్ మృతి చెందాడు. ఇండో టిబేటన్ బార్డర్ పోలీస్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడిన ఘటనలో అన్నమయ్య జిల్లా, సంబేపల్లి మండలం, దేవపట్లకు చెందిన దేవరింటి రాజశేఖర్ (34) అనే ఆర్మీ జవాన్ మృతి చెందిన విషయం తెలిసిందే… ఆర్మీ జవాన్ రాజశేఖర్ మృతదేహాన్ని ఐటిబిపి అధికారులు స్వగ్రామైన దేవపట్లకు తీసుకొచ్చారు.
విషయం తెలుసుకున్న అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, 53వ ఐటిబిపి బెటాలియన్ డిప్యూటీ కమాండెటర్ ఆయూస్ దీపక్ లు జవాన్ రాజశేఖర్ స్వగృహానికి చేరుకొని ఆర్మీ జవాన్ రాజశేఖర్ భౌతిక గాయాన్ని సందర్శించి పుష్ప గుచ్చాలు ఉంచి శ్రధ్దాంజలి ఘటించారు. జవాన్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్మీ జవాన్ రాజశేఖర్ కుటుంబానికి అండగా ఉంటుందని, రెండు రోజుల్లో పరిహారం చెక్కును అందజేస్తామని జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్ వెల్లడించారు. సంబేపల్లి మండల కేంద్రం నుండి దేవపట్ల వరకు అధికార లాంఛనాలతో అంతిమ యాత్ర నిర్వహించారు.
జవాన్ అంతిమ యాత్రలో సంబేపల్లె, దేవపట్ల ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు రోడ్డుకు ఇరువైపులా నిలుచుని అడుగడుగునా పూలు చల్లుతూ జై జవాన్, అమర్ రహే రాజశేఖర్ అంటూ సెల్యూట్ చేస్తూ నినాదాలు చేశారు. అంతిమ యాత్ర అనంతరం స్వగ్రామైన దేవపట్లలో ఆర్మీ జవాన్ రాజశేఖర్ అంత్యక్రియలు సైనిక్, ఏపీ ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. జవాన్ పార్థివ దేహంపై ఆర్మీ అధికారులు ఉంచిన జాతీయ జెండాను జవాన్ రాజశేఖర్ భార్య ప్రమీలకు ఆర్మీ అధికారులు అందజేశారు. ఐటిబిపి, ఏపీ పోలీసులు ఆర్మీ జవాన్ రాజశేఖర్ పార్ధవదేహం వద్ద నిలబడి గౌరవవందనం చేసి గాలిలోకి కాల్పులు జరిపి శ్రద్ధాంజలి ఘటించారు. తుది వీడ్కోలు పలకడానికి జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. సంబేపల్లె తహశీల్దార్ దగ్గర ఉండి ఏర్పాట్లను పరిశీలించారు. రాయచోటి రూరల్ సీఐ లింగప్ప ఆధ్వర్యంలో సంబేపల్లె ఎస్ఐ మహమ్మద్ షరీఫ్, పోలీసు సిబ్బంది బందోబస్తును నిర్వహించారు.
Read Also: Vijayashanti: బీజేపీపై రివర్స్ ఎటాక్.. వాళ్లను పాతరేస్తే బెటర్