MLC Elections 2023: ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలు కాకరేపుతున్నాయి.. ఈ నెల 23వ తేదీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి.. ఇప్పటికే దీనిపై తమ ఎమ్మెల్యేలకు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి కూడా విప్ జారీ చేసింది. ఈ నెల 20వ తేదీన అసెంబ్లీ సమావేశాలకు తప్పకుండా హాజరు కావాలని.. 23వ తేదీ పార్టీ సూచించిన అభ్యర్థికి ఓటు వేయాలని విప్ జారీ చేసింది వైసీపీ.. అయితే, విప్ ధిక్కరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు చీఫ్ విప్ ప్రసాద్ రాజు. మరోవైపు.. ఎమ్మెల్యేల కదలికలపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినట్టు తెలుస్తోంది..
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
23న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో.. ఎమ్మెల్యేల కదలికలపై అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటెలిజెన్స్ నిఘా పెట్టించిందట.. అసంతృప్తులు ఎవరైనా ఉన్నారా? అని జిల్లాల్లో ఆరా తీస్తోంది వైసీపీ అధిష్టానం.. అయితే, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఏడు మాత్రమే ఖాళీగా ఉన్నా.. ఇప్పడు 8 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.. అనూహ్యంగా తెలుగు దేశం పార్టీ అభ్యర్థిని పోటీకి పెట్టింది.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క ఓటు చే జారినా ఫలితాలపై ప్రభావం పడనుంది.. అయితే, ఈ మధ్యే వైసీపీకి రెబల్‌గా మారిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి.. ఆత్మ ప్రభోదానుసారం ఓటేస్తాం అని ప్రకటించడంతో.. వారి ఓట్లు వైసీపీకి పడడం డౌట్‌గానే ఉంది.. ఇక, ఆ ఇద్దరు ఎమ్మెల్యేల దారిలో ఇంకెవరైనా ఉన్నారా? అని ఆరా తీస్తోంది వైసీపీ అధిష్టానం.. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాలు అధికార పార్టీకి వ్యతిరేకంగా వచ్చిన నేపథ్యంలో.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానం చేజారకుండాజాగ్రత్తలు తీసుకుంటోంది వైసీపీ.
కాగా, ఎమ్మెల్యేల కోటాలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 23న ఎన్నికలు జరగనున్నాయి. ఏడు స్థానాలకు వైసీపీ అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీ తరపున పంచుమర్తి అనురాధ బరిలోకి దిగిన విషయం విదితమే. మరోవైపు.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై కసరత్తు చేస్తోన్న వైసీపీ.. ఈ రోజు ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ నిర్వహించనుంది… మొన్నటి నుంచి టీంల వారీగా ఓరియెంటేషన్ కొనసాగుతోంది.. ఒక్క ఓటు కూడా ఇన్ వ్యాలిడ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది వైసీపీ.. అందులో భాగంగా ఈ రోజు సభకు అందరూ హాజరు కావాలని విప్ జారీ చేసిన విషయం తెలిసిందే.