India Today Survey: మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే నిర్వహించిన లేటెస్ట్ సర్వేలో దేశంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు మరోసారి మోదీకే పట్టం కడతారని స్పష్టమైంది. అయితే 2019లో వచ్చిన సీట్ల కంటే బీజేపీకి మెజారిటీ తగ్గుతుందని ఇండియా టుడే-సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. బీజేపీకి 2019 ఎన్నికల్లో 303 సీట్లు వచ్చాయి. కానీ వచ్చే ఎన్నికల్లో బీజేపీ 286 సీట్లకే పరిమితం అవుతుందని సర్వే అంచనా వేసింది. గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీకి సీట్లు పెరుగుతాయని.. ఆ పార్టీ 146 సీట్లు గెలుచుకుంటుందని.. ఇతర పార్టీలు 111 సీట్లు గెలుచుకుంటాయని వివరించింది. అటు ప్రధానిగా మరోసారి మోదీని 53 శాతం ప్రజలు కోరుకుంటున్నారని.. రాహుల్ గాంధీని ప్రధానిగా 9 శాతం మందే ఇష్టపడుతున్నారని సర్వే వెల్లడించింది.
Read Also: Emirates Airlines Offer: ఫ్రీగా వస్తుందని ఈ లింక్ క్లిక్ చేస్తే.. మీ ఖాతాలు ఖాళీ..!!
కాగా ఈ సర్వేను ఈ ఏడాది ఫిబ్రవరి-ఆగస్టు నెలల మధ్య నిర్వహించినట్లు ఇండియాటుడే తెలిపింది. తెలుగు రాష్ట్రాలలో ప్రజల మద్దతు ఎలా ఉందో కూడా ఇండియా టుడే సర్వే వెల్లడించింది. ఏపీలో మరోసారి ప్రజలు వైసీపీకే జై కొడతారని సర్వే తెలిపింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీకి 18 సీట్లు, టీడీపీకి 7 సీట్లు వస్తాయని.. జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఒక్క సీటు కూడా రాదని సర్వే తేల్చి చెప్పింది. తెలంగాణ విషయానికి వస్తే .. 2024 ఎన్నికల్లో బీజేపీ పుంజుకుంటుందని ఇండియాటుడే-సీ ఓటర్ సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతం బీజేపీకి తెలంగాణలో 4 ఎంపీ సీట్లు ఉండగా, వచ్చే ఎన్నికల్లో 6 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని వివరించింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి 8, కాంగ్రెస్ పార్టీకి 3 స్థానాలు లభించవచ్చని సర్వే అంచనా వేసింది.
