Husband Koteswara Rao Killed His Wife Swathi: గుంటూరు జిల్లాలోని తెనాలిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బ్యూటీ పార్లర్ నడుపుతున్న భార్యను భర్త కిరాతకంగా హతమార్చాడు. ‘స్థలం’ విషయంలో ఇద్దరి మధ్య నెలకొన్న విభేదాలే ఇందుకు కారణం. స్థలం అమ్మాలని చాలారోజుల నుంచి భర్త కోరుతుండగా.. భార్య అందుకు ఒప్పుకోలేదు. దీంతో కోపాద్రిక్తుడైన భర్త.. పార్లర్‌లోనే భార్యని కత్తితో నరికి చంపాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. తెనాలిలోని గాంధీ నగర్‌కు చెందిన కోటేశ్వరరావు(35)కి కొన్ని సంవత్సరాల క్రితం స్వాతి(31) అనే మహిళతో వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. భార్య స్వాతి బ్యూటీ పార్లర్ నడుపుతోంది. పెళ్లైన కొన్నాళ్ల వరకూ వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. ఎలాంటి గొడవలు లేకుండా.. మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా వారి సంసారం నడిచింది.
కానీ.. ఆ తర్వాత కోటేశ్వరరావు చెడు అలవాట్లకు బానిసయ్యాడు. రానురాను అతడు అప్పులు చేయడం మొదలుపెట్టాడు. ఈమధ్య బాకీలు తారాస్థాయికి చేరుకోవడంతో.. భార్య పేరు మీదున్న స్థలాన్ని అమ్మేసి, ఆ అప్పులు తీర్చాలని అనుకున్నాడు. అయితే.. స్వాతి అందుకు ఒప్పుకోలేదు. ‘నీ బాకీలకు నా స్థలం ఎందుకు అమ్మాలి?’ అని ఎదురు తిరిగింది. కోటేశ్వరరావు ఎంత వేడుకున్నా.. స్వాతి స్థలం అమ్మేందుకు అస్సలు అంగీకరించలేదు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. గురువారం (17-11-22) కూడా ఇద్దరి మధ్య మరోసారి ఘర్షణ జరిగింది. ఈసారి కూడా ససేమిరా అనేసిన స్వాతి, బ్యూటీ పార్లర్‌కి వెళ్లిపోయింది. దీంతో కోపాద్రిక్తుడైన కోటేశ్వరరావు.. నేరుగా బ్యూటీపార్లర్‌కు వెళ్లి, కత్తితో నరికి చంపేశాడు. అనంతరం భార్య మృతదేహంపై దండలు వేసి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఈ కేసులో ఎలాగో తాను దొరికిపాతానుకున్నాడో ఏమో.. భార్యని చంపిన అనంతరం రూపర్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కోటేశ్వరరావు లొంగిపోయాడు. తన భార్య స్థలం అమ్మేందుకు ఒప్పుకోకపోవడం వల్లే తాను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడనని చెప్పాడు. అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని, దర్యాప్తు చేస్తున్నారు.