Site icon NTV Telugu

Godavari Floods: పోలవరం ముంపు మండలాలు అతలాకుతలం..! ఇళ్లు ఖాళీ చేస్తున్న ప్రజలు..

Floods

Floods

గోదావరి ఉగ్రరూపం దాల్చింది.. భద్రాచలం దగ్గర క్రమంగా వరద ఉధృతి పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది.. దీంతో.. దిగువ ప్రాంతంలో ప్రజలు అల్లాడిపోతున్నారు.. ముఖ్యంగా పోలవరం ముంపు మండలాల్లో పరిస్థితి దయనీయంగా తయారింది.. గోదావరి ఉగ్రరూపంతో అతలాకుతలం అవుతున్నాయి పోలవరం ముంపు మండలాలు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు ప్రజలు.. ఇప్పటికే అనేక గ్రామాలు జల దిగ్బంధంలోకి వెళ్లిపోగా.. మరోవైపు గంట గంటకు పెరుగుతున్న నీటి మట్టం.. ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది.. వేలేరుపాడు మండల కేంద్రం సహా 30 గ్రామాలను ఇప్పటికే వరదనీరు చుట్టుముట్టింది..

Read Also: CM YS Jagan: గుడ్‌న్యూస్‌ చెప్పిన ఏపీ సీఎం.. 2,61,516 మందికి లబ్ధి

మరోవైపు, రేపకాగోమ్ము, కోయిదా, కట్కూరు, కన్నాయిగూడెం, వేలేరుపాడు, నల్లారం, జగన్నాథపురం వంటి పలు గ్రామాలు ఇప్పటికే నీటమునిగాయి.. భద్రాచలంలో గోదావరి నీటి మట్టం 70 అడుగులకు చేరితే కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు జల సమాధి అవుతాయనే ఆందోళనతో ప్రజలు వణికిపోతున్నారు.. లంక గ్రామాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరుతుండడంతో.. ఏటి గట్ల మీద బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ప్రజలు.. అధికారులు బియ్యం ఇచ్చి వెళ్లారని, ఎక్కడ వండుకోవాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. పిల్లలకు పాలు కూడా దొరకడం లేదని ఆవేదన చెందుతున్నారు.. ఇక, పునరావాస కేంద్రాల్లో భోజన సౌకర్యం కూడా లేదని.. అక్కడికొచ్చి ఏం చేయాలని ప్రశ్నిస్తున్నారు లంక గ్రామాల ప్రజలు.. గోదావరి ఉధృతి మరింత పెరిగితే అల్లకల్లోలంగా లంక గ్రామాల్లో పరిస్థితి మారుతుందనే ఆందోళన మాత్రం వెంటాడుతూనే ఉంది.

Exit mobile version