శాంతిభద్రతల నేపథ్యంలో బెజవాడలో హై అలెర్ట్ విధించారు పోలీసులు. సీపీఎస్ రద్దుని కోరుతూ ఛలో సీఎంఓకు యూటీఎఫ్ పిలుపివ్వడంతో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు. విజయవాడకు వచ్చే అన్ని ప్రధాన రహదారుల్లో భారీగా మొహరించారు పోలీసులు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు విధులలో వున్నారు. సర్వీస్ నుంచి నేషనల్ హైవే మీదకి రాకుండా మధ్యలో ఫెన్సింగ్.. ముళ్ల కంచెలతో భద్రత ఏర్పాటుచేశారు. పొట్టిపాడు, దావులూరు, కాజా చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టారు.
ఐడీ కార్డులు.. సెల్ ఫోన్లు తనిఖీలు చేసి మరీ వదులుతున్నారు పోలీసులు. దావులూరు చెక్ పోస్ట్ వద్ద 27 మందిని.. తుమ్మలపల్లి కళా క్షేత్రం వద్ద మరో పది మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తుమ్మలపల్లి కళాక్షేత్రం, ప్రకాశం బ్యారేజీ, వారధి, సీఎం నివాసం వద్జ పెద్ద ఎత్తున పోలీసుల మొహరించారు.
కంకిపాడు మండలం దావులూరు టోల్ గేట్ వద్ద పోలీసుల తనిఖీలు. ఉపాధ్యాయులు చేపట్టిన సీఎంఓ ముట్టడి నేపథ్యంలో ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు పోలీసులు. అదుపులోకి తీసుకున్నవారిని స్టేషన్‌కి తరలించారు. యూటీఎఫ్ నిరసనకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే.
మరో వైపు సిఎం ఇంటి ముట్టడి కి అనుమతి లేదని, అనేక మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నాం అన్నారు గుంటూరు ఎస్పీ ఆరిఫ్. చట్టాన్ని ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్.