ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన ఉందని తెలిపింది వాతావరణశాఖ. నైరుతి బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాలను ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది. ఇది క్రమంగా వాయవ్య దిశగా పయనించి తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వైపు వస్తుందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 11, 12 మరియు 13 తేదీల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
Read Also: Gold Buying: బంగారంపై దృష్టిసారించిన బ్యాంకులు.. టాప్‌లో ఆర్బీఐ..
అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.. 11వ తేదీన తిరుపతి, నెల్లూరు.. 12న తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. మిగతా ప్రాంతాల్లో కొన్ని చోట్ల తక్కువ వర్షం పడుతుందని వివరించింది.. అయితే, నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న భూమధ్య రేఖ ప్రాంతంలోని హిందూ మహా సముద్రంపై ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని.. దాని ప్రభావంతో వచ్చే 48 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. వాయువ్య దిశగా తమిళనాడు, పుదుచ్చేరి తీరం వైపు అల్పపీడనం కదిలే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో మూడు రోజులపాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ.