Haseena Commits Suicide After She Caught With Facebook Boyfriend: ఆమె ఒక వివాహిత. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అంతా సజావుగానే సాగుతోంది. కానీ.. ఎప్పుడైతే ఫేస్‌బుక్‌లో ఒక వ్యక్తి పరిచయమయ్యాడో, అప్పట్నుంచి ఆమె జీవితం తలక్రిందులైంది. తనకంటే 27 ఏళ్ల పెద్దవాడైన వ్యక్తితో ప్రేమలో పడి.. అన్ని వదులుకొని వెళ్లింది. ఆ తర్వాత పరిణామాలన్నీ తేడా కొట్టడంతో.. ఆమె విగతజీవిగా మారింది. నంద్యాల జిల్లాలో దోర్నిపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. దొర్నిపాడుకు చెందిన హసీనా(25)కు చిన్న వయసులోనే పెళ్లి జరిగింది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే.. భర్త మద్యానికి బానిస కావడం, తనని వేధిస్తుండటంతో, హసీనా అతనికి దూరంగా ఉంటోంది.
కట్ చేస్తే.. రెండేళ్ల క్రితం హసీనాకు ఫేస్‌బుక్‌లో బాపట్ల జిల్లా నర్సయ్యపాలెం గ్రామానికి చెందిన భూషణం(52)తో పరిచయం ఏర్పడింది. భార్యని వదిలేసిన అతనికి.. 20 ఏళ్ల కుమారుడు, 18 ఏళ్ల కుమార్తె ఉంది. రెండేళ్లుగా హసీనా, భూషణం ఫోన్‌లో చాటింగ్ చేసుకోవడం, మాట్లాడుకోవడం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల తన వద్దకు వచ్చేయాలని హసీనాను భూషణం పిలిచాడు. దీంతో.. ఈ నెల 1వ తేదీన హసీనా ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా, తన ఏడేళ్ల కుమారుడితో కలిసి భూషణం దగ్గరికి వెళ్లిపోయింది. తన కూతురు కనిపించడం లేదని హసీనా తండ్రి దూదెకుల భాషా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వాళ్లు రంగంలోకి దిగి, గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి బాపట్లలోని నర్సయ్య పాలెంలో వాళ్లిద్దరు ఉన్నారన్న విషయం తెలుసుకొని, పోలీసులు అక్కడికెళ్లి, వాళ్లను అదుపులోకి తీసుకుని, దొర్నిపాడుకు తీసుకొచ్చారు.
పోలీసులు ఆ ఇద్దరికి కౌన్సలింగ్ ఇచ్చిన అనంతరం.. 3వ తేదీన హసీనాను తండ్రికి అప్పగించి, ఇంటికి పంపించారు. అటు భూషణాన్ని కూడా వదిలేయడంతో, అతడు తిరిగి బాపట్లకు వెళ్లిపోయాడు. అయితే.. శుక్రవారం ఉదయం 6 గంటలకు హసీనా తన మేనమామ ఇంట్లో ఫ్యాన్‌కి ఉరేసుకొని, బలవన్మరణానికి పాల్పడింది. అవమాన భారం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందో లేక మరే ఇతర కారణమో తెలీదు కానీ.. ఆమె సూసైడ్‌తో హసీనా ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.