Harirama Jogaiah: కాపు రిజర్వేషన్‌ల అమలుపై మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు హరిరామజోగయ్య ఏపీ ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించారు. అగ్రవర్ణాల మాదిరిగా కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో డిసెంబర్ 30 వరకు సీఎం జగన్‌కు టైం ఇస్తున్నామని.. అప్పటివరకు కాపు రిజర్వేషన్‌ల అమలుపై స్పష్టత ఇవ్వకపోతే జనవరి 2 నుంచి నిరవధిక నిరాహారదీక్షకు దిగుతానని హరిరామజోగయ్య హెచ్చరించారు. తాను చచ్చి అయినా కాపులకు రిజర్వేషన్‌లు సాధించుకుని తీరతానని ఆయన స్పష్టం చేశారు. 2021లో కాపు సంక్షేమ సేన ఏర్పాటు చేసి రిజర్వేషన్‌ల కోసం ఉద్యమిస్తున్నామని చెప్పారు.
Read Also: Namaz Controversy: క్యాంపస్‌లో నమాజ్ చదివిన విద్యార్థులు.. రాజుకున్న వివాదం
కాపు రిజర్వేషన్‌ల అంశంలో తమకు సహకరించాలని కాపు సామాజికవర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలకు ఉత్తరాలు రాశామని హరిరామజోగయ్య తెలిపారు. గతంలో శాసనసభ చేసిన తీర్మానం ప్రకారం 10 శాతం అగ్రవర్ణాల రిజర్వేషన్‌లలో 5 శాతం కాపులకు కల్పించాలని ఆయన పేర్కొన్నారు. రిజర్వేషన్‌లు తమ హక్కు అని హరిరామజోగయ్య స్పష్టం చేశారు. కాగా హరిరామజోగయ్య 50 ఏళ్ల కిందటే చట్టసభల్లో అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు అన్ని పార్టీలను ఆయన కవర్ చేశారు. కానీ ఇటీవల జనసేన పార్టీని హరిరామజోగయ్య లైక్ చేస్తున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు.