Turaka Kishore: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాచర్ల మాజీ మున్సిపల్ ఛైర్మన్ తురకా కిషోర్ ఎట్డకేలకు జైలు నుండి విడుదలయ్యారు. ఎనిమిది నెలలుగా జైలులో ఉన్న కిషోర్.. ఏపీ హైకోర్టు ఆదేశాలతో విడుదలయ్యాడు. ఇప్పటికే కిషోర్ పై 11 హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. ఆరేళ్ల క్రితం జరిగిన దాడి కేసులో రెంటచింతల పోలీసులు కిషోర్ ను పీటీ వారెంట్ పై అరెస్టు చేశారు. దీనిపై కిషోర్ హైకోర్టును ఆశ్రయించాడు. కిషోర్ అరెస్టు అక్రమమని హైకోర్టు చెప్పింది. వెంటనే విడుదల చెయ్యాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
Read Also: YSRCP vs TDP: జడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ వైసీపీ షాక్..
అయితే, హైకోర్టు ఉత్తర్వులలో సాంకేతిక కారణాలు సాకుగా చూపడంతో జైలు నుండి విడుదల కావడం ఆలస్యమయ్యింది.. హైకోర్టు ఆదేశాలతో నిన్నే జైలు నుంచి విడుదల అవుతారని భావించినా.. ఉత్తర్వులు జైలు చేరడంలో కొంత ఆలస్యం.. అందులో సాంకేతిక సమస్యలు.. ఇలా కిషోర్ విడుదల సాయంత్రం వరకు వాయిదా పడింది.. ఈ సందర్భంగా తురకా కిషోర్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం తనపై కక్ష సాధిస్తూ ఎనిమిది నెలలుగా జైలులో ఉంచారన్నారు. నా పిల్లలుకూడా నన్ను గుర్తుపట్టనివ్వకుండా 214 రోజులు జైలులో ఉంచారని పేర్కొన్నారు. జైలులో ఉన్న సమయంలో వైసీపీ నా కుటుంబానికి అండగా నిలిచిందని, తాను బయటకు రావడానికి సహకరించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు మాచర్ల మాజీ మున్సిపల్ ఛైర్మన్ తురకా కిషోర్.