Ambati Rambabu: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మాస్ పార్టీ అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు.. అందుకే పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కడకు వెళ్లినా లక్షలాది మంది ప్రజలు తరలివస్తారని అన్నారు. గుంటూరులో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీని మరింత బలోపేతం చేసే దిశగా సంస్థాగత నిర్మాణం చేపట్టాలని జగన్ ఆదేశించారని అంబటి రాంబాబు తెలిపారు. రానున్న 45 రోజుల్లో ఈ సంస్థాగత నిర్మాణ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే సుధాకరబాబుకు ముఖ్య బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. ఇక, వైసీపీ స్థాపించినప్పటి నుంచే పార్టీ సంస్థాగత నిర్మాణానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ పని చేస్తున్నామని తెలిపారు. గ్రామ స్థాయి వరకు వెళ్లి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ సంస్థాగత నిర్మాణాన్ని ఒక మహాయజ్ఞంగా చేపట్టామని పేర్కొన్నారు. జగన్ ఒక్కరితో ప్రారంభమైన పార్టీ ఈ రోజు వేలాదిగా, లక్షలాదిగా, కోట్లాది మంది కార్యకర్తల పార్టీగా మారిందని అంబటి రాంబాబు అన్నారు.
Read Also: GG W vs UPW W: ఉత్కంఠ మ్యాచులో బోణి కొట్టిన గుజరాత్ జెయింట్స్..!
ఇక, మాజీ ఎమ్మెల్యే సుధాకరబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో బాధ్యత కలిగిన ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ పనిచేస్తోందని, ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయంటూ విమర్శలు చేశారు. వైసీపీ పాలనలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని, మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేశామని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం దుర్మార్గమైన పాలన సాగుతోందని ఆరోపించారు. ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాను మరింత బలోపేతం చేసి కూటమి ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో గుంటూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
